తెలుగుదేశం పార్టీని అణచివేయాలని రెండు సంవ‌త్స‌రాలుగా నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌పై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు, కార్యకర్తల ఆర్థిక మూలాలు దెబ్బతీశారని,  తెలంగాణ ఉద్యమంలో కూడా పార్టీ ఆఫీసులపై దాడులు జరగలేదని, కేవ‌లం ఏపీలో వైసీపీ పాల‌న‌తోనే దాడులు జ‌రుగుతున్నాయ‌న్నారు.  ఏపీని గంజాయి కేంద్రంగా మార్చారని, వైసీపీ గూండాలకు పోలీసులు ఎస్కార్ట్ ఇచ్చారని, మంగ‌ళ‌వారం రాష్ట్ర‌వ్యాప్తంగా జ‌రిగిన దాడులు ప్రభుత్వం, పోలీసులు కలిసి చేసినవేన‌న్నారు. సీబీఐ విచారణ జరిపించాలని గవర్నర్‌ను కోరామని, ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని కోరామని, ఆయ‌న స్పంద‌న‌పై, ఆయ‌న తీసుకునే నిర్ణ‌యాన్ని బ‌ట్టి త‌మ త‌దుప‌రి చ‌ర్య‌లు ఉంటాయ‌న్నారు. దాడులు జ‌రుగుతుంటే నిలువ‌రించాల్సిన పోలీసులు అధికార పార్టీకి వ‌త్తాసు ప‌ల‌క‌డం వారి విధినిర్వ‌హ‌ణ‌కే అవ‌మాన‌క‌ర‌మ‌ని, ఇటువంటివారు రేపు ప్ర‌జ‌ల‌ను ఎలా కాప‌డ‌తార‌ని ప్ర‌శ్నించారు. శాంతిభ‌ద్ర‌త‌ల విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వం, పోలీసులు ఘోరంగా విఫ‌ల‌మయ్యార‌ని విమ‌ర్శించారు. ఎప్ప‌టికైనా ప్ర‌జాస్వామ్యమే గెలుస్తుంద‌నే విష‌యాన్ని ముఖ్య‌మంత్రి గుర్తుంచుకోవాల‌న్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: