హుజురాబాద్ ఎన్నికలు తెలంగాణ రాజకీయాలను దిశా నిర్దేశం చేస్తాయని, రాష్ట్రానికి మేలి మలుపులాంటివ‌ని  కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇంత నిర్భంధ వాతావ‌ర‌ణంలోను హుజూరాబాద్ ప్రజలు బీజేపీకి అండగా ఉన్నారని, హుజూరాబాద్‌లో బీజేపీ గెలుపు ఖాయమని,  మెజారిటీపైనే చర్చ జ‌రుగుతుంద‌న్నారు. కేసీఆర్ కుటుంబం అబద్దాల పూనకం ఊగుతోందని, సీఎం పదవి ఎడమకాలి చెప్పుతో సమానం అన్న కేసీఆర్‌కు ఓటు అడిగే హక్కు లేదని, ఎలా ఓట్లు అడుగుతున్నార‌ని ప్ర‌శ్నించారు. కాంగ్రెస్‌తో కలిసే ఖర్మ మాకేంటి అని అన్న కిషన్‌ రెడ్డి అలాంటి చీకటి ఒప్పందాలు ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కే సాధ్యమని, అటువంటివి చేసేవి కూడా తెలంగాణ రాష్ట్ర స‌మితి అని వ్యాఖ్యానించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో భార‌తీయ జ‌న‌తాపార్టీ గెలుపును ఎవ‌రూ ఆపలేర‌ని, ఎట్టి ప‌రిస్థితుల్లోను క‌మ‌లం జెండాను రెప‌రెప‌లాడిస్తామ‌న్నారు. ద‌ళిత బంధు ప‌థ‌కం అనేది కేవ‌లం ఓట్ల కోసం ప్ర‌జ‌లను మాయ‌చేయ‌డానికేన‌ని, అటువంటి ప‌థ‌కాలు చూసి ఎవ‌రూ మోస‌పోవ‌ద్ద‌న్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి ప‌థంలో ప‌య‌నింప‌చేయ‌డానికి బీజేపీ కృషిచేస్తోంద‌ని కిష‌న్‌రెడ్డి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: