అగ్గిపెట్టెల ధ‌ర‌లు పెర‌గ‌బోతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు ఒక అగ్గిపెట్టె ఒక రూపాయిగా ఉండేది. ఇక‌నుంచి ఇది రూ.2 అవ‌బోతోంది. ఈమేర‌కు అగ్గిపెట్టెల త‌యారీదారులు త‌మిళ‌నాడులోని శివ‌కాశీలో స‌మావేశ‌మై నిర్ణ‌యం తీసుకున్నారు. డిసెంబ‌రు ఒక‌టోతేదీ నుంచి ఈ ధ‌ర అమ‌ల్లోకి రానున్న‌ట్లు అగ్గిపెట్టెల త‌యారీదారుల సమాఖ్య వెల్ల‌డించింది. ముఖ్యంగా త‌మిళ‌నాడులో ఈ ప‌రిశ్ర‌మ‌పై ఆధార‌ప‌డి నాలుగు ల‌క్ష‌ల నుంచి ఐదు ల‌క్ష‌ల మంది జీవిస్తున్నారు. క‌రోనా త‌ర్వాత అన్నిర‌కాల ముడిస‌ర‌కుల ధ‌ర‌లు పెరిగాయాని, వీటికితోడు పెట్రోలు ధ‌ర‌లు పెర‌గ‌డంతో ర‌వాణా ఛార్జీలు విప‌రీతంగా పెరిగాయ‌ని త‌యారీదారుల స‌మాఖ్య కార్య‌ద‌ర్శి సేతుర‌థిన‌మ్ తెలిపారు. త‌ప్పనిస‌రి ప‌రిస్థితుల్లో ధ‌ర‌ను పెంచాల్సి వ‌స్తోంద‌న్నారు. 2007లో అగ్గిపెట్టె ధ‌ర 50 పైస‌లుగా ఉండేది. ఆ సంవ‌త్స‌రంలో రూపాయి చేశారు. మ‌ళ్లీ 14 సంవ‌త్స‌రాల త‌ర్వాత ధ‌ర పెరిగింది. రెడ్‌ఫాస్ప‌ర‌స్‌, గంధం, మైనం, బాక్స్ బోర్డులు, పొటాషియం, పేప‌రు, క్లోరేట్ త‌దితరాల‌న్నీ ధ‌ర‌లు పెరిగాయి. గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా పెరుగుతున్నాయ‌ని, వీటిని అదుపుచేయ‌క‌పోతే భ‌విష్య‌త్తులో రూ.3 అయినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రంలేద‌ని సేతుర‌థిన‌మ్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: