దేశ‌వ్యాప్తంగా మెడిక‌ల్ క‌ళాశాలలో ప్ర‌వేశానికి నిర్వ‌హించే  నేష‌న‌ల్ ఎలిజిబిలిటీ క‌మ్ ఎంట్రెన్స్ టెస్ట్ కౌన్సెలింగ్ 2021 కు సుప్రీంకోర్టు బ్రేకులు వేసింది. నీట్‌లో రిజ‌ర్వేష‌న్ల చెల్లుబాటుపై తుది నిర్ణయం తీసుకునే వ‌ర‌కు కౌన్సెలింగ్  నిలిపి వేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు. రిజర్వేషన్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోకముందే కౌన్సెలింగ్‌ ప్రారంభించడం వల్ల విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది. జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

ప్రస్తుతం విద్యా సంవత్సరం నుంచి నీట్‌ పీజీ ఆలిండియా కోటాలో ఓబీసీలకు 27 శాతం, ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 2021 జులైలో మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ నోటిఫికేషన్ విడుద‌ల చేసింది. దీంతో జనరల్‌ కేటగిరీ విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, అవకాశాలు తగ్గిపోతాయని, ప్రతిభవంతులు మరుగున పడిపోతారని కొంతమంది నీట్‌ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎంసీసీ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు అభ్య‌ర్థులు.   ఇది ఇలా ఉండ‌గానే అక్టోబర్‌ 25 నుంచి నీట్‌ పీజీ కౌన్సెలింగ్‌ నిర్వహించేందుకు కేంద్రం షెడ్యూల్‌ విడుదల చేసింది. దీంతో  మరోసారి పిటిషనర్లు   కోర్టు మెట్లెక్కారు. కోర్టు తీర్పు వ‌చ్చేంత వ‌ర‌కు కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభించ‌బోమ‌ని కేంద్రం స్పష్టం చేసింది.  కేంద్రం తరఫున అడిషినల్‌ సొలిసిటర్‌ జనరల్‌ కేఎం నటరాజ్‌ వాదనలు వినిపించ‌గా.. న్యాయ‌వాది దాతర్ పిటిషనర్ల తరఫున వాదనలు వినిపించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: