తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో వ‌రిధాన్యం కొనుగోలు కేంద్రం వ‌ద్ద దారుణ‌మైన ఘ‌ట‌న చోటు చేసుకుంది.  ధాన్యం కొనుగోలు కేంద్రం వ‌ద్ద జాప్యం జ‌ర‌గ‌డంతో రైతు గుండె త‌ట్టుకోలేక ఆగిపోయింది. ఈ ఘ‌ట‌న కామారెడ్డి జిల్లా వ‌డ్లూర్ ఎల్లారెడ్డిలో చోటు చేసుకున్న‌ది. వివ‌రాల్లోకి వెళ్లితే.. వ‌డ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో నివ‌సించే రాజ‌య్య‌(48) త‌న‌కు ఉన్న పొలంలో వ‌రిపంట వేసాడు.

పండిన పంటను క‌ల్లంలోంచి నేరుగా గ్రామంలో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చారు. దాదాపు మూడు రోజుల పాటు నిరీక్షించినా కానీ.. ఆ రైతు ధాన్యాన్ని కొనుగోలు చేయ‌లేదు. రాత్రి, ప‌గ‌లు తేడా లేకుండా ధాన్యం కొనుగోలు కేంద్రం వ‌ద్దే మూడు రోజుల పాటు కాపు గాసాడు. అది జీర్ణించుకోలేని రాజ‌య్యకు గురువారం సాయంత్రం ఆక‌స్మాత్తుగా గుండెపోటు సంభ‌వించింది. స్థానికంగా తోటి రైతులు ఆయ‌న‌ను ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. అయితే అప్ప‌టికే రైతు రాజ‌య్య మృతి చెందాడు. ధాన్యం కొనుగోలు కేంద్రం వ‌ద్ద ప్ర‌భుత్వం జాప్యం చేయ‌డం మూలంగానే రాజ‌య్య అనే రైతు మృతి చెందాడు అని గ్రామ‌స్తులు ఆందోళ‌న చేప‌ట్టారు. ఈనెల 22న వ‌న‌ప‌ర్తి జిల్లా ఖిల్లా గ‌ణ‌పురం వ‌ద్ద కూడా  ధాన్యాన్ని ఆర‌బెడుతున్న ఓ రైతు గుండెపోటు మ‌ర‌ణించిన విష‌యం విధిత‌మే.



మరింత సమాచారం తెలుసుకోండి: