సిరివెన్నెల మ‌న‌కు ఇక లేర‌ని, సాహిత్యానికి చీక‌టి రోజులు అని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. ఆయ‌న మృతి చెందార‌నే వార్త తెలుసుకొని చిరంజీవి కిమ్స్ ఆసుప‌త్రికి వెళ్లారు. కిమ్స్ ఆసుప‌త్రిలోనే రేపు ఉద‌యం వ‌ర‌కు సిరివెన్నెల పార్థివ దేహం ఉండ‌నున్న‌ద‌ని తెలుసుకుని చిరంజీవి అక్క‌డికి చేరుకుని సిరివెన్నెల కుటుంబ స‌భ్యులను ప‌రామ‌ర్శించారు. అనంత‌రం మెగాస్టార్ కిమ్స్ వ‌ద్ద మీడియాతో మాట్లాడారు.

సిరివెన్నెల మృతి తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు తీర‌ని లోట‌ని, ఆయ‌న మృతిని జీర్ణించుకోలేక‌పోతున్నాం అని వెల్ల‌డించారు. త‌న పాట‌ల‌తో సిరివెన్నెల ఎప్ప‌టికీ బ‌తికే ఉంటార‌ని, ఒక మ‌హా వృక్షాన్ని కోల్పోయాం అని పేర్కొన్నారు. సిరివెన్నెల‌లో శ్రీ‌శ్రీ ఆవేశం చాలా ఉంటుంద‌ని వెల్ల‌డించారు. చిరంజీవికి సిరివెన్నెల మ‌ధ్య మంచి స్నేహం ఉంద‌ని.. మిత్ర‌మా అంటూ ఆత్మీయంగా ప‌లిక‌రిస్తారు అని చెప్పారు. శ్రీ‌శ్రీ‌, వేటూరి కలిస్తే సిరివెన్నెల అని పేర్కొన్నారు. అయితే సిరివెన్నెల ఆరోగ్యం బాగాలేద‌ని అత‌ను ఆసుప‌త్రిలో చేరడానికి ముందు రోజు ఫోన్ చేసాన‌ని తెలిపారు. అప్పుడు సిరివెన్నెల చాలా సంతోషంగా మాట్లాడార‌ని తెలిపారు మెగాస్టార్‌.  ముఖ్యంగా సిరివెన్నెల‌, తాను ఒకే సంవ‌త్స‌రంలో పుట్టామ‌ని, అందుకే మా ఇద్ధ‌రి మ‌ధ్య స్నేహం అలా ఉంద‌ని వెల్ల‌డించారు. ఆయ‌న ర‌చ‌న‌ల్లో చెడును క‌డిగేయాల‌ని, అన్యాయాన్ని ఎదుర్కోవాల‌నే భావాజాలం ఉంటుందని వివ‌రించారు చిరంజీవి.
మరింత సమాచారం తెలుసుకోండి: