ప్రతి పేదవాడు ఆకలితో ఇబ్బందులు పడకుండా కడుపు నింపాలన్నదే  ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జగన్ సంకల్పమని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.  రాష్ట్రంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఇంటింటికి పంపిణీ చేస్తున్నామని వెల్ల‌డించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తెల్లవారుజామున నుంచే వైఎస్సార్‌ సామాజిక పెన్షన్లు, వికలాంగ పెన్షన్లు, దీర్ఘకాలిక రోగులకు పెన్షన్లు పంపిణీ ఒక మహా యజ్ఞంలా కొన‌సాగుతుంద‌ని వెల్ల‌డించారు మంత్రి.  పొద్దుపొడవక ముందే  ఇంటి తలుపు తట్టి అందిస్తున్నారు వాలంటీర్లు. ఒకటవ తేదీన‌ అందిస్తున్న పెన్షన్లు ఒక పెద్దకొడుకు కంటే ఎక్కువ బాధ్యత తీసుకుంటున్న సీఎం జగన్‌మోహన్ రెడ్డికి ఈ జన్మంతా రుణపడి ఉంటామని లబ్ధిదారులు పేర్కొంటున్న‌ట్టు మంత్రి వివ‌రించారు.

 ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 60,50,650 మంది లబ్ధిదారులకు పెన్షన్‌ అందించనున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేసారు. దీనికోసం రూ.1,411.42 కోట్ల మొత్తాన్ని  గ్రామ, వార్డు సచివాలయ ఖాతాల్లో జమ చేశామని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. వాలంటీర్లు లబ్ధిదారుల ఇండ్ల‌ వద్దకు వెళ్లి డబ్బులు పంపిణీ చేయనున్నట్టు వివరించారు. సాంకేతిక కారణాల వల్ల ఏ ఒక్కరికీ పెన్షన్‌ అందలేదనే ఫిర్యాదు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని మంత్రి  పెద్దిరెడ్డి స్పష్టం చేసారు.  కేవ‌లం ఐదు  రోజుల వ్యవధిలో నూరుశాతం పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్టు మంత్రి పేర్కొన్నారు. పెన్షన్ కానుక పంపిణీని డీఆర్‌డీఏ  కాల్ సెంటర్ల ద్వారా పర్యవేక్షణ చేస్తున్నామని మంత్రి వివ‌రించారు.




మరింత సమాచారం తెలుసుకోండి: