తెలంగాణ‌లోని రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో మంగ‌ళ‌వారం రాత్రి రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకున్న‌ది. బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని వెనుక నుంచి వచ్చిన కారు ఢీ  కొట్టిన‌ది.  ఔటర్ రింగ్ రోడ్డుపై ప్ర‌యివేటు పెట్రోలింగ్ వాహనం నడిపే వ్యక్తి డ్యూటీ ముగించుకుని శంషాబాద్ వైపు బైక్‌పై వస్తుండగా వెనక నుంచి వేగంగా వ‌చ్చిన‌ మారుతి సియాజ్TS 07 FA 9534 నెంబ‌ర్ గ‌ల‌ కారు ఢీ కొట్టింది. దీంతో  బైక్‌పై వెళ్తున్న వ్యక్తి కిందపడి  తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. దీంతో వెంట‌నే  స్థానికులు అక్కడికి చేరుకుని కారును చుట్టుముట్టి.. కారును డ్రైవ్ చేస్తున్న మహిళను కిందికి దిగాలని హడావుడి చేసారు.

ఈ ఘ‌ట‌న‌పై సమాచారం  తెలుసుకున్న‌ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గాయపడిన వ్యక్తిని వెంట‌నే ఆస్పత్రికి తరలించారు పోలీసులు. కారులో ఉన్న మహిళను కిందికి దిగాలని ఆదేశించగా ఆమె బయటకు వచ్చిన‌ది. కారు డ్రైవింగ్ చేసిన మహిళను సీరియల్ నటి లహరిగా గుర్తించడంతో అక్కడున్న వారందరూ షాక్ కు గుర‌య్యారు. అయితే ఆమె మద్యం మత్తులో యాక్సిడెంట్ చేసి ఉంటుందని అనుమానించిన పోలీసులు లహరిని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి.. అక్కడ ఆమెకు బ్రీత్ అనలైజర్‌తో పరీక్షించగా మద్యం సేవించలేదని తేలిన‌ది. గాయపడిన వ్యక్తి  ఫిర్యాదు చేయకపోవడంతో బుల్లితెర న‌టీ ల‌హ‌రిని పోలీసులు ఇంటికి పంపించారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: