క్యాసినో ఏర్పాటు చేసినట్లు వస్తున్న ఆరోపణలపై ఏపీ మంత్రి కొడాలి నాని ఎట్టకేలకు స్పందించారు. కృష్ణా జిల్లాలోని గుడివాడలో క్యాసినో నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ప్రచారంపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కల్యాణ మండపంలో క్యాసినో నిర్వహిస్తున్నట్లు నిరూపిస్తే తను రాజకీయ జీవితం నుంచి తప్పుకుంటానని, అలాగే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పటించుకుంటానని తెలిపారు. ఒకవేళ నిరూపించకపోతే టీడీపీ నేతలు ఏం చేస్తారని ఛాలెంజ్ విసిరారు.  


కాగా, సంక్రాంతి పండుగ సమయంలో తాను హైదరాబాద్‌లో ఉన్నానని పేర్కొన్నారు. తాను హైదరాబాద్‌లో ఉన్నానని తెలుసుకుని గుడివాడలో యువతులతో డ్యాన్సులు ఏర్పాట్లు చేసినట్లు తెలిసిందని, అప్పుడు తాను పోలీసులకు ఫోన్ చేసి ఆపివేయాలని చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. తాను గుడివాడలో లేని సమయంలో చంద్రబాబు తన అనుకూల మీడియాలో తప్పుడు ప్రచారం చేయించాడని ఆరోపించారు.


ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని.. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేను ఊళ్లో లేని సమయం చూసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నాకు క్యాసినో అంటేనే తెలియదు. క్యాసినో అంటేనే లోకేష్, చంద్రబాబుకు తెలుస్తుంది. అమెరికాలో మందు కొడుతూ.. స్విమ్మింగ్ ఫూల్‌లో అమ్మాయిలతో ఎంజాయ్ చేసేది లోకేష్. మహిళలను అడ్డం పెట్టుకుని తప్పుడు ప్రచారం చేయడం చంద్రబాబుకు కొత్తేం కాదు.’ అని ఆయన ఆరోపించారు. 


నిజ నిర్ధారణ కమిటీ పేరుతో గుడివాడకు పంపి ఉద్రిక్తత చోటు చేసుకోవడానికి కారణం చంద్రబాబేనన్నారు. సంక్రాంతి సందర్భంగా పట్టణంలో కోడి పందెలు, ఎడ్ల పందెలు సాధారణంగా జరిగాయని, కానీ క్యాసినో లాంటిది జరగలేదన్నారు. ఒకవేళ హెరిటేజ్‌లో వ్యభిచారం జరుగుతుందంటే.. తనను అక్కడికి వెళ్లనిస్తారా..? అని కొడాలి నాని మండిపడ్డారు. కాగా, శుక్రవారం ఉదయం నుంచి గుడివాడలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మంత్రి కొడాలి నానికి చెందిన కన్వెన్షన్‌ను పరిశీలించడానికి వెళ్లిన టీడీపీ నిజ నిర్ధారణ కమిటీని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో టీడీపీ, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేసిన వైసీపీ కార్యకర్తలు, కొడాలి నాని అనుచరులు.. మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా కారు అద్దాలను ధ్వంసం చేశారు. పరిస్థితిని అదుపులో తీసుకునేందుకు టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.




మరింత సమాచారం తెలుసుకోండి: