మహారాష్ట్రలో విషాద ఘటన చోటు చేసుకుంది. సోమవారం అర్ధరాత్రి వార్ధా-తుల్జాపూర్ హైవే సులెసురా వద్ద వేగంగా వస్తున్న ఒక కారు దాదాపు 40 ఫీట్ల మేరా పల్టీ కొట్టింది. కారు మొత్తం నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు వైద్య విద్యార్థులతోపాటు ఎమ్మెల్యే కొడుకు మృతి చెందాడు. దీంతో మహారాష్ట్రలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


పూర్తి వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని వార్ధా జిల్లా సులెసురా సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వస్తున్న కారు.. అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తిరోడా అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే విజయ్ రహంగ్‌ధేల్ కుమారుడు ఆవిష్కర్ రహంగ్‌ధేల్‌తోపాటు మరో 7గురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.


పోలీసులు సమాచారం మేరకు.. సోమవారం అర్ధరాత్రి ప్రమాదం జరిగిందని, కారు ఎదురుగా వన్యప్రాణులు రావడంతో.. వాటిని కాపాడే క్రమంలో ఈ ప్రమాదం జరిగిందన్నారు. కారు అదుపు తప్పి బ్రిడ్జిని పగులగొట్టుకుని కాలువలో పడిందన్నారు. ఈ ప్రమాదంలో మరణించిన ఏడుగురు విద్యార్థులు సహంగి మేఘే మెడికల్ కళాశాల విద్యార్థులుగా గుర్తించామన్నారు. యవత్మాల్ నుంచి సావాంగి మేఘేకు తిరిగి వస్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుందని అక్కడి ఎస్పీ ప్రశాంత్ హోల్కర్ తెలిపారు.


ప్రమాదంలో మరణించిన వారి పేర్లు ఈ విధంగా ఉన్నాయి. ఆవిష్కర్ రహంగ్‌ధన్(బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు), నీరజ్ చౌహాన్, నితీష్ సింగ్, వివేక్ నందన్, ప్రత్యూష్ సింగ్, శుభమ్ జైస్వాల్, పవన్ శక్తి. ఈ మేరకు వీరి డెడ్ బాడీలను మార్చరీలకు పంపించామని, బాధితుల ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: