టీడీపీ కూటమి అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. సూపర్ సిక్స్‌లు అంటూ కూటమి భారీ వరాలు కురిపించింది. ఉచిత బస్ దగ్గరి నుంచి చాలానే పథకాలు అందిస్తామని హామీ ఇచ్చింది. వీటిల్లో ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా ఒక భాగమనే చెప్పుకోవచ్చు.ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఎన్నికలకు ముందు ఇచ్చిన కీలక హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చేందుకు సిద్ధమైంది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి దీపం పేరిట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం- 2024 ప్రారంభించనుంది. ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరిచే లక్ష్యంతో ఈ స్కీమ్ రూపొందించింది. ఈ పథకం కింద, అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తారన్న సంగతి తెలిసిందే.మహిళలు ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు మహిళలకు త్వరలోనే ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకువస్తే బాగుంటుందని జనాలు కోరుకుంటున్న సంగతి తెలిసిందే.అయితే ఇందుకోసం ఎంత ఖర్చవుతుందన్న విషయాన్ని ఇప్పటికే పౌరసరఫరాల శాఖ అధికారులకు ఆయన ఆదేశించినట్లు తెలిసింది. ఒక సిలిండర్ మూడు నెలలు వస్తుందని, ఏడాదికి మూడు సిలిండర్లు ఎంత మందికి ఇవ్వాల్సి ఉంటుందన్న లెక్కలు వేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెబుతున్నారు. ఈ పథకాన్ని సెప్టంబరు లేదా అక్టోబరు నెల నుంచి ఇవ్వాలన్న యోచనలో ఉన్నారని తెలిసింది. దసరా కానుకగా మహిళలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయాలని చంద్రబాబు దాదాపుగా నిర్ణయానికి వచ్చినట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. విపక్షం విమర్శలను తిప్పికొట్టేందుకు త్వరగానే దీనిని అమలు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధమవుతున్నారని తెలిసింది. .ఈ నేపథ్యం లోనే ఈ స్కీమ్ కింద సిలిండర్లు ఉచితంగా పొందడానికి కొన్ని అర్హతలు ఉండాలి. ఆంధ్రప్రదేశ్‌లో శాశ్వత నివాసిగా ఉండాలి. అలానే ఇంట్లో ఒకే LPG గ్యాస్ కనెక్షన్ కలిగి ఉండాలి. రాష్ట్రంలో ఆర్థికంగా వెనకబడిన వర్గానికి చెందిన కుటుంబాలు, డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు మాత్రమే అర్హులు. ఈ అర్హతలు లేని వారికి ఈ స్కీమ్ వర్తించదు.అర్హుత ఉన్న ప్రతి దరఖాస్తుదారునికి సంవత్సరానికి మొత్తం మూడు LPG గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందుతాయి. దీంతో ప్రజల ఇంటి ఖర్చులు భారీగా తగ్గుతాయి. ఈ పొదుపును ఇతర అవసరాలకు వినియోగించుకోవచ్చు.
మరోవైపు, ఈ స్కీమ్ కింద ఉచితంగా సిలిండర్లు అందడానికి కేవైసీ ప్రాసెస్ కోసం గ్యాస్ ఏజెన్సీల్లో ఎవరైనా డబ్బులు తీసుకుంటే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చిరిస్తున్నారు.