ఇటీవల మూడేళ్ళ క్రితం టెలికాం రంగంలో జియో రంగప్రవేశంతో మొబైల్ వాయిస్ కాల్స్ మరియు ఇంటర్నెట్ టారిఫ్ ధరలు చాలావరకు తగ్గి, సామాన్యుడికి సైతం అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే జియో ప్రవేశపెట్టిన ఆఫర్లతో మిగతా టెలికాం నెట్వర్క్ లు కూడా ధరలు తగ్గించి దిగిరాక తప్పలేదు. ఇక త్వరలో డిటిహెచ్, వాయిస్ కాల్స్, ఇంటర్నెట్ మూడూ కలిపి అతి తక్కువ ధరకు ఇచ్చేలా ఇప్పటికే జియో గిగా ఫైబర్ పేరుతో జియో అధికారికంగా ప్రకటించడం జరిగింది. మరొక రెండు రోజుల్లో దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో పూర్తిగా అందుబాటులోకి రానున్న ఈ సేవలు, ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పైలెట్ ప్రాజక్టు కింద ఇవ్వడం జరిగింది. రూ.700 నుండి రూ.10,000 వరకు తమ టారిఫ్ ప్లాన్లు ఉంటాయని, 

అలానే ఇంటర్నెట్ స్పీడ్ 100 ఎంబీపీఎస్ నుండి 1 జిబిపీఎస్ వరకు ఉంటుందని తమ కంపెనీ యాన్యువల్ జనరల్ మీటింగ్ లో తెలిపిన జియో సంస్థ అధినేత ముఖేష్ అంబానీ, సెప్టెంబర్ 5 న పూర్తి ప్లాన్ ల వివరాలతో తమ సంస్థ కార్యకలాపాలను మొదలుపెట్టడం జరుగుతుందని అన్నారు. అయితే జియో చేసిన ఆ సంచలన ప్రకటన తరువాత డిటిహెచ్, ఇంటర్నెట్ ఆపరేటర్లు అంతర్మథనంలో పడ్డారు. అంతేకాక కొన్ని ఇంటర్నెట్ సంస్థలు ఆ తరువాత తమ టారిఫ్ ప్లాన్ల స్పీడ్ మరియు ధరల్లో మార్పులు చేసి వినియోగదారుల్ని ఆకర్షించే ప్రయత్నాలు మొదలెట్టాయి. అయితే ఈ విషయమై ప్రభుత్వ రంగ సంస్థైన బిఎస్ఎన్ఎల్ ఒకింత దూకుడుగా ముందుకు సాగుతున్నట్లు సమాచారం. దీనిపై నిన్నటి నుండి పలువురు టెక్ నిపుణులు చెప్తున్న వివరాల ప్రకారం, 

ఇప్పటికే బిఎస్ఎన్ఎల్ సంస్థ, జియో వలె వినియోగదారులకు కేబుల్, ఇంటర్నెట్, వాయిస్ కాల్స్ వంటి మూడు సర్వీసులు కూడా రూ.700 రేంజ్ లో అందించేలా ఇప్పటికే గట్టిగా ప్రణాళికలు చేపట్టిందట. అంతేకాక అందులోని ఉద్యోగులు దీనిపై పలు ప్రాంతాల్లో పరిశీలన మొదలెట్టారని, అయితే జియో మాదిరిగా ఇంటర్నెట్, ఫ్రీ కాల్స్ తో పాటు ఎక్కడికక్కడ లోకల్ కేబుల్ ఆపరేటర్లతో బిఎస్ఎన్ఎల్ ఒప్పందం కుదుర్చుకుని వినియోగదారులకు ఛానల్స్ అందించే ఏర్పాటు చేయనుందని అంటున్నారు. అయితే ఇప్పటికే కొన్ని ప్రాంతాలను పైలెట్ ప్రాజక్ట్ కింద టెస్ట్ సర్వీస్ అందించేందుకు సిద్ధం చేసిందట. అందులో ముందుగా ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం నుండి ఈ సేవలు మొదలవుతాయని అంటున్నారు. 

ఈ మేరకు అక్కడి కేబుల్ ఆపరేటర్లతో కూడా ఆ సంస్థ ప్రతినిధులు చర్చలు జరిపి వారిని ఒప్పించినట్లు సమాచారం. అలానే జియో మాదిరిగా బిఎస్ఎన్ఎల్ కూడా మూడు రకాల సేవలను అందించేందుకు వీలుగా ఒకే రూటర్ ని కూడా సిద్ధం చేయబోతున్నట్లు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం అందుతున్న ఈ సమాచారం పై అతి త్వరలో బిఎస్ఎన్ఎల్ ప్రతినిధుల నుండి అధికారిక ప్రకటన కూడా వెలువడనుందట. మరి ఇది కనుక నిజమే అయితే, ఒకరకంగా ఈ సర్వీస్ తో బిఎస్ఎన్ఎల్ చాలావరకు జియోకు షాక్ నివ్వడం ఖాయమని అంటున్నారు టెక్ నిపుణులు....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: