నిన్న మొన్నటి వరకూ అడ్డూ... అదుపూ లేకుండా పెరిగిన పసిడి ధర ఇప్పుడు దిగివస్తోంది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం 40 వేల రూపాయల దిగువకు చేరింది. మరోవైపు వెండి ధర కూడా భారీగా తగ్గింది. 


బులియన్‌ మార్కెట్లో పసిడి మెరుపులకు బ్రేక్‌ పడింది. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల వల్ల ధర తగ్గుతూ వస్తుంది. నిన్న ఒక్క రోజే పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 15 వందలు తగ్గింది. ఢిల్లీలోని స్పాట్‌ మార్కెట్ లో నిన్న 39వేల 225 రూపాయలకు పది గ్రాముల మేలిమి బంగారం అమ్ముడుపోయింది.  ఎంసీఎక్స్ ట్రేడింగ్‌లో కూడా బంగారం ధర పతనమైంది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ దాదాపు అర శాతం తగ్గి... 38 వేల 300 రూపాయలుగా ఉంది. గత వారం గోల్డ్ ఫ్యూచర్స్‌లో పది గ్రాముల బంగారం 39 వేల 885  రూపాయలు పలికింది.    


అంతర్జాతీయ మార్కెట్ లోనూ  బంగారం ధర పతనమౌతోంది. నిన్న బంగారం ధర నెల రోజుల కనిష్టానికి పడిపోయింది. ఔన్సు బంగారం ధర 14 వందల 94 డాలర్లకు దిగి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్ లో వారం రోజుల్లో 4 శాతానికి పైగా పసిడి ధర పతనమైంది. షేర్‌ మార్కెట్ లు పుంజుకోవడంతో బంగారం నుంచి పెట్టుబడులు మళ్లడమే దీనికి కారణం. వెండి ధర కూడా తగ్గుముఖం పట్టింది. నిన్న ఒక్క రోజే 8 శాతం పతనమైంది. దీంతో కేజీ వెండి ధర 47 వేల 405 రూపాయలుగా ఉంది. బంగారం, వెండి ధరల పతనానికి అమెరికా డాలర్‌తో పోల్చితే రూపాయి బలపడడం కూడా ఓ కారణం. ఈ ఏడాది బంగారం ధర 20 శాతం వరకూ పెరిగింది. అయితే... ఇప్పుడు ధరలు దిగి వస్తుండడంతో రానున్న పండగ సీజన్‌లో నగల అమ్మకాలు పెరుగుతాయని ఆశిస్తున్నారు వ్యాపారులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: