రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలకమైన వడ్డీరేట్లను ఇప్పటికే నాలుగుసార్లు తగ్గించిన విషయం తెలిసిందే. మరోసారి కీలక వడ్డీరేట్లను శుక్రవారం రోజు తగ్గించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆగస్టు నెలలో 35 బేసిక్ పాయింట్లను ఆర్బీఐ తగ్గించింది. భారతదేశంలో వ్యాపారానికి అనుకూలంగా ఉండే వాతావరణం నెలకొల్పాలనే ఆలోచనతో ప్రభుత్వం కార్పొరేట్ పన్నును కూడా గణనీయంగా తగ్గించింది. 
 
ఆర్బీఐ గవర్నర్ గా పదవీ భాద్యతలు చేపట్టిన రోజు నుండి ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వృద్ధిరేటును పెంచటం కొరకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అక్టోబర్ 4వ తేదీన జరగబోయే ద్వైమాసిక పరపతి విధాన సమీక్షలో వడ్డీ రేట్ల తగ్గింపు గురించి నిర్ణయాలను వెల్లడించనున్నారని తెలుస్తోంది. ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గిస్తే ఆ నిర్ణయం వెంటనే అమలులోకి వస్తుంది. 
 
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఒక సందర్భంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థకు చేయూత ఇవ్వటానికి అవకాశాలు తక్కువగా ఉండటంతో ఆర్బీఐ ద్వారా ఎక్కువగా ఉపశమనాలను కల్పించాలని కేంద్రం భావిస్తుందని తెలిపారు. ఆర్బీఐ వడ్డీరేట్ల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలతో వాహన రుణాలు మరియు గృహ రుణాలు తగ్గబోతున్నాయి. వడ్డీ రేట్ల తగ్గింపు వలన కీలకమైన ఈఎంఐల భారం కూడా తగ్గే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. 
 
ఆటో రంగంలో అమ్మకాలు మరియు నిర్మాణ రంగంలో కొనుగోళ్లు నెలనెలా తగ్గుతున్న నేపథ్యంలో వడ్డీ రేట్ల తగ్గింపుతో ఈ రంగాలు పుంజుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆగస్టు నెలలో జరిగిన సమీక్షలో ఆర్బీఐ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలను ఆదుకుంటామని కీలకమైన ప్రకటన చేసింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు మొండి బకాయిలు వసూలవ్వక ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆర్బీఐ వీటికి ఆర్థిక దన్ను లభించే విధంగా చర్యలు చేపడుతున్నది. 



మరింత సమాచారం తెలుసుకోండి: