నిజంగా `బంగారం`లాంటి వార్తే  ఇది. గ‌త కొద్దికాలంగా రికార్డు స్థాయిలో దూసుకుపోతున్న పసిడి ధరలు ఎట్టకేలకు దిగొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పడిపోవడం, దేశీయంగా పెళ్లిళ్ల సీజన్‌లో అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉండటంతో ధర రూ.39 వేల దిగువకు పడిపోయింది. గతంతో పోలిస్తే ధరలో రూ.548 తగ్గుదల కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న మందకొడి పరిస్థితుల వల్లనే ప్రాంతీయంగా ధరలు భారీగా తగ్గాయని, దివాలీ తర్వాత డిమాండ్ అంతంత మాత్రంగానే ఉంటుందని గతంలోనే అంచనావేసినట్లు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సీనియర్ విశ్లేషకులు తపన్ పటేల్ తెలిపారు.


తాజాగా దేశ రాజధాని న్యూఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల ధర రూ. 38,857కి పడిపోయింది.  పసిడితోపాటు వెండి భారీగా పడిపోయింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు నిలిచిపోవడంతో కిలో వెండి ధర ఏకంగా రూ.1,190 తగ్గి రూ.47,090 వద్ద ముగిసింది. అంతకుముందు ఇది రూ.48,280గా ఉంది. అమెరికా-చైనా దేశాల మధ్య జరుగుతున్న చర్చలు ఆశావాదంగా ఉన్నప్పటికీ అతి విలువైన లోహాలపై తీవ్ర ఒత్తిడి నెలకొన్నదన్నారు. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 1,493 డాలర్ల వద్దకు చేరుకోగా, వెండి 17.77 డాలర్ల వద్ద నిలిచింది.


కాగా, దీపావ‌ళికి అమ్మ‌కాల షాక్ త‌గిలిన సంగ‌తి తెలిసిందే. ధన్‌తేరాస్ రోజు కూడా అతి విలువైన లోహాలను కొనుగోలు చేయడానికి జనం వెనుకంజవేశారు. గరిష్ఠ స్థాయికి చేరుకున్న ధరలు, వినియోగదారులు ఖర్చులను తగ్గించుకోవడం అధిక ప్రాధాన్యతనివ్వడంతో శుక్రవారం దేశవ్యాప్తంగ పసిడి, వెండి అమ్మకాలు 40 శాతం పడిపోయాయి. సీఏఐటీ అంచనాప్రకారం శుక్రవారం సాయంత్రం వరకు దేశవ్యాప్తంగా రూ.2,500 కోట్ల విలువైన 6 వేల టన్నుల బంగారం అమ్ముడైనట్లు తెలిపింది. క్రితం ఏడాది ఇదే రోజు అమ్ముడైన రూ.5,500 కోట్ల విలువైన 17 వేల కిలోలతో పోలిస్తే 35 శాతం నుంచి 40 శాతం వరకు తక్కువ. సామాన్యుడికి అందనంత దూరానికి పసిడి చేరుకోవడంతో అమ్మకాలు భారీగా పడిపోయాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: