ఉల్లి కొనకుండానే కన్నీరు తెప్పిస్తోంది. మహారాష్ట్రలో వర్షాల కారణంగా ఉల్లి ఉత్పత్తి తగ్గిపోయింది. కర్నూలులో సరుకు నాణ్యత లేకపోవటంతో ఎక్కువ రోజులు నిల్వ చేయలేకపోతున్నారు. కర్ణాటక నుంచి రావాల్సిన ఉల్లి ఆశించినంతగా రావటం లేదు. వర్షాలు తగ్గి కొత్త పంట మార్కెట్‌లోకి వస్తే తప్పా ధరలు తగ్గే అవకాశం మాత్రం కనిపించటం లేదు. 


ఉల్లి ధరలు మళ్లీ ఆకాశాన్ని తాకాయి. తాజాగా ఉల్లి ధర కిలో 90 రూపాయలకు చేరుకుంది. పలు రాష్ట్రాల్లోనైతే వంద రూపాయల దిశగా అతివేగంగా వెళుతోంది. ఆగస్టు, సెప్టెంబరులో వీటి ధరలు కిలో 80 రూపాయలు పలికాయి. మహారాష్ట్రలో అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతినడంతో ఉల్లి కొరత ఏర్పడి ధరలు అమాంతం పెరిగాయి. దేశంలోనే అతిపెద్ద ఉల్లి ధరలు మళ్లీ కంటతడి పెట్టిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కేజీ  80 నుంచి 100 రూపాయల వరకూ పలుకుతోంది. ఆగస్టు, సెప్టెంబరు మాసాల్లోనే ఉల్లి ధరలు చుక్కలనంటాయి. ఆ తర్వాత కాస్త తగ్గినా ఇప్పుడు మళ్లీ ధర ఎగబాకుతోంది. 


ఇక... ఉల్లి ఎక్కువగా పండే మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా అకాల వర్షాలు పడుతున్నాయి. దీంతో పంటలు తీవ్రంగా దెబ్బతిని మార్కెట్లకు ఉల్లి రావడం బాగా తగ్గిపోయింది. వ్యాపారులు తమ వద్ద ఉన్న నిల్వల ధరలు కూడా పెంచేస్తున్నారు. హోల్‌సేల్‌ ఉల్లి మార్కెట్‌ అయిన లాసాల్‌గావ్‌లో కిలో ధర 55 రూపాయలకు పైగానే పలుకుతోంది. ఉల్లి పండించే ప్రాంతాలైన నాసిక్‌, అహ్మద్‌నగర్‌, పుణెల్లో గత రెండు వారాల్లో భారీ వర్షాలు కురిసి పంట నష్టం జరిగింది. వర్షాలు ఇలాగే కొనసాగితే ధరలు మరింత పెరగవచ్చని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


తమిళనాడులో ఉల్లి ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో ఇక్కడ కిలో ఉల్లిని 90 నుంచి 100 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. తెలంగాణలో కిలో ఉల్లి ధర 70 నుంచి 80 మధ్య, ఆంధప్రదేశ్‌లో 50 నుంచి 70 రూపాయల మధ్య ధర పలుకుతోంది.


ఇటు... కర్నూలు నుంచి తెప్పిస్తున్న సరకు నాణ్యత లేక ఎక్కువ రోజులు నిల్వ చేయలేకపోతున్నారు. నాణ్యమైన ఉల్లి క్వింటా హోల్‌సేల్‌లో 4 వేలుగా చెబుతున్నారు. ఈ సరుకు నిల్వ చేస్తే పాడవుతుండటంతో చిల్లర దుకాణాలకు వచ్చేసరికి ధర పెంచి విక్రయిస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటకలో వర్షాలు కొనసాగుతుండటం, తుపాను హెచ్చరికల నేపథ్యంలో ధరలు ఇప్పట్లో తగ్గే పరిస్థితి లేదని మార్కెట్‌వర్గాలు విశ్లేషిస్తున్నాయి. గత నెలలో ధరలు పెరగడంతో మార్కెటింగ్‌ శాఖ జోక్యం చేసుకుని నాఫెడ్‌ నుంచి కొనుగోలు చేసి రైతుబజార్లలో రాయితీపై కిలో 25కు వారంపాటు విక్రయించటంతో ధరలు అదుపులోకి వచ్చాయి. ఆ తర్వాత ఆ అమ్మకాలు ఆపేశారు. 


కర్ణాటక, కర్నూలు నుంచి రావాల్సిన పంట ఆశించిన స్థాయిలో లేకపోవడంతో స్థానిక అవసరాలకు మహారాష్ట్ర ఉల్లిపాయలపైనే ఆధారపడాల్సి వస్తోంది. అక్కడి మార్కెట్లలో పాతవి క్వింటా 6 వేలు ధర పలుకుతుంది. దీంతో స్థానిక వ్యాపారులు ఆచితూచి కొనుగోలు చేస్తున్నారు. రోజుకు 50 బస్తాలు విక్రయించే హోల్‌సేల్‌ వ్యాపారులు 20కి మించి అమ్మలేకపోతున్నారు. పెద్ద పెద్ద హోటళ్లు, క్యాటరింగ్‌ నిర్వాహకులు, పకోడి వేసే వ్యాపారులు తప్పనిసరి పరిస్థితుల్లో పెరిగిన ధరకు కొంటున్నారు. చిరువ్యాపారులు, సామాన్య వినియోగదారులు కర్నూలు ఉల్లితో సరిపెట్టుకుంటున్నారు. దీంతో వ్యాపారులు కూడా కర్నూలు ఉల్లిని దిగుమతి చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ధరలు అనూహ్యంగా పెరగడంతో వ్యాపారాలు దెబ్బతింటున్నాయని, బస్తా కొనేవాళ్లు పది కిలోలతో సరిపెట్టుకుంటున్నారని వ్యాపారులు చెబుతున్నారు. ధర పెరగడంతో పెట్టుబడులు పెరిగి పరిమితంగానే సరకు నిల్వ చేసుకుంటున్నారు. మహారాష్ట్ర, కర్నూలు మార్కెట్ల సమాచారాన్ని ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుని సరకు కొనుగోలు చేస్తున్నారు. ఏమైనా వర్షాలు తగ్గి కొత్త పంట మార్కెట్లోకి వస్తేగానీ పరిస్థితులు చక్కబడే అవకాశాలు కనిపించడం లేదని మార్కెట్‌వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దీంతో వినియోగదారులకు ఉల్లి కన్నీళ్లు తప్పేలా లేవు.




మరింత సమాచారం తెలుసుకోండి: