ఓ వైపు సొంత ఆస్తుల్లో రికార్డులు సృష్టిస్తూ ముందుకు సాగుతున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ...తాజాగా త‌న కంపెనీతో భారత వ్యాపార చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించారు. ఐఐఎఫ్ఎల్ వెల్త్-హురన్ విడుదల చేసిన ధనికుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ వరుసగా ఎనిమిదోసారి దేశంలోని కుబేరుల్లో టాప్ ప్లేస్‌లో నిలిచిన సంగ‌తి ఇంకా మ‌రువ‌క ముందే... రిల‌య‌న్స్ కంపెనీ 10లక్షల కోట్ల రూపాయల మార్కెట్‌ విలువను దాటిన తొలి భారతీయ కంపెనీగా చరిత్రకెక్కింది. ముఖేష్‌ అంబానీ నేతృత్వంలోని ఈ కంపెనీ షేరు ఇవాళ్టి ట్రేడింగ్‌లో 1శాతం పెరిగి 15 వందల 81 రూపాయల 60 పైసలకు చేరింది. ఈ ఒక్క ఏడాదే షేరు ధర 40 శాతం పెరగడం విశేషం. కాగా, ఆసియాలో అతిపెద్ద ఇంద‌న సంస్థ పెట్రోచైనా కంపెనీని కూడా రిల‌య‌న్స్ అధిగ‌మిస్తుంద‌ని మార్కెట్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.

 

రిలయన్స్‌.. అక్టోబర్‌ 18న 9 లక్షల కోట్ల రూపాయల మార్కెట్‌ విలువకు చేరుకుంది. ఈ వారం చివరికి వచ్చేసరికి 10 లక్షల కోట్ల రూపాయల మార్కును దాటింది. ఈ రికార్డును రిల‌య‌న్స్ సొంతం చేసుకోవ‌డం వెనుక అత్యధిక లాభాలు, టెలికాం టారీఫ్‌ల పెంపు, గ్యాస్‌ ఉత్పత్తి మొదలవ్వడం కంపెనీ షేర్‌ను లాభదాయకంగా మార్చ‌డం కార‌ణంగా విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. రిలయన్స్‌ తర్వాతి స్థానంలో ఉన్న టీసీఎస్‌కు మార్కెట్‌ విలువలో దాదాపు 2లక్షల కోట్ల రూపాయల వ్యత్యాసం ఉంది. దీంతో రియ‌ల‌న్స్ ఇండ‌స్ట్రీస్ య‌జ‌మాని ముఖేశ్ అంబానీ ప్ర‌పంచంలో 12వ కుబేరుడిగా మారారు. ఆసియాలోనే అత్యంత సంప‌న్నుడిగా అవ‌త‌రించారు. ఆయ‌న సంప‌ద 60.7 బిలియ‌న్ల డాల‌ర్లుగా ఉన్న‌ది.

 

 

ఇదిలాఉండ‌గా, రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ ఇటీవ‌లే చ‌రిత్ర సృష్టించింది. ముఖేశ్ అంబానీకి చెందిన ఆ సంస్థ ఇప్పుడు ఎలైట్ ఎన‌ర్జీ క్ల‌బ్‌లో చేరింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న మేటి ఇంధ‌న కంపెనీల్లో ఒక‌టిగా ఆర్ఐఎల్‌ చోటు సంపాదించింది. ప్ర‌స్తుతం ఆర్ఐఎల్ మార్కెట్ విలువ 138 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉంది. 132 బిలియ‌న్ డాల‌ర్ల విలువైన బ్రిటీష్ కంపెనీని అది దాటేసింది. ఏడాది కాలంలో రిల‌య‌న్స్ షేర్లు మూడు రేట్లు పెరిగిన‌ట్లు మార్కెట్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. దాదాపు 40 శాతం షేర్లు పెరిగిన‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. ద‌లాల్ స్ట్రీట్‌లో రిల‌య‌న్స్ దూసుకువెళ్ల‌డంతో.. ప్ర‌పంచ కుబేరుల్లో ప్ర‌స్తుతం ముకేశ్ అంబానీ 12వ స్థానానికి చేరుకున్నారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: