కోడి ధర కొండెక్కింది. రెండు వారాల్లో ఏకంగా కిలో కోడి ధర 50 రూపాయలకు పైగా పెరిగి.. చికెన్‌ ప్రియులకు భారంగా మారింది. ముక్క నోట్లోకి పోనిదే ముద్ద దిగని చికెన్‌ ప్రియులు... పెరిగిన ధరల్ని చూసి నిట్టూరుస్తున్నారు. అయితే కోడి మరణాల శాతం గతంతో పోలిస్తే కాస్త పెరిగిందనీ, దీనికి తోడు మేత, ఇతర వ్యయాలు సైతం పెరిగి.. ధర పెరిగినట్లు హేచరీస్‌ యజమానులు చెబుతున్నారు. 

 

మాంసాహారులకు అత్యంత ప్రియమైంది చికెన్. వారంలో ఒక్కసారైనా చికెన్‌ లేనిదే ముద్దదిగదు. అలాంటి చికెన్ ధర పైపైకి దూసుకెళ్తోంది.. ఊరిస్తోంది. స్కిన్‌లెస్‌ చికెన్‌ ... కిలో 230 రూపాయలు పలుకుతోంది. రెండు వారాలతో పోలిస్తే కిలో ధర ఏకంగా 50 రూపాయలు పెరిగింది. దీంతో వారాంతంలో కిలో చికెన్‌ కొనేవాళ్ళు.. పావు, అర్థ కిలోతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. రాబోయే రోజుల్లో చికెన్ ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. 

 

కోడి ధర పెరగడానికి ప్రధానంగా కారణం.. ఉత్పత్తి తగ్గడమేనని పరిశ్రమరంగ నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు కోళ్లకు వ్యాధులు రావడం కూడా ఓ కారణమంటున్నారు. సాదారణంగా వేసవిలో కోళ్ల మరణాలు ఎక్కువగా ఉంటాయని.. అలాంటిది ఈ సీజన్‌లో రెండు రెట్లు అధికంగా ఉన్నాయన్నారు. జూన్‌ మొదటి వారం నుంచి ఈ ధరలు పెరుగుతూ వస్తున్నాయని చెబుతున్నారు. కోళ్ల తరలింపు వ్యయం భారీగా పెరిగిందని.. ఈ పరిణామాలు కూడా ఓ కారణంగా చెబుతున్నారు.

 

కోళ్ల దాణ ధరలు పెరగడం కూడా రేటు పోటుకు కారణమవుతోంది. కోళ్లమేతలో ముఖ్యమైన సోయా, మొక్కజొన్నలు మార్కెట్‌లోకి తక్కువగా రావడం, ధరలు అధికంగా ఉండడంతో... కోడి ధర కొండెక్కిందన్నారు. అయితే ఇది ఏటా జరిగే ప్రక్రియేనని పశువైద్యశాఖ అధికారులు చెబుతున్నారు. కోళ్ల ఉత్పత్తి అధికంగా ఉన్నప్పుడు ధరలు తగ్గడం, మరణాల సంఖ్య అధికంగా ఉన్న ఉన్నప్పుడు ధరలు పెరగడం సాదారణంగా జరుగుతున్న ప్రక్రియేనని పశువైద్య శాఖ అధికారులు చెబుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: