ఈ మధ్యకాలంలో సైబర్ క్రైమ్స్ మరి దారుణం అయిపోయాయి... ఎప్పుడు ఎలా డబ్బులు పోతున్నాయో తెలియటం లేదు.. ఈ నేపథ్యంలోనే బెంగుళూరో ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఓ పిజ్జా కోసం ఏకంగా 95 వేలు రూపాయిలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన ఈ నెల 1న జరగగా కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

 

బెంగుళూరు లోని కోరమంగళకు చెందిన ఎన్‌వీ షేక్ అనే వ్యక్తి డిసెంబరు 1న మధ్యాహ్నం 1:30 సమయంలో ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోలో ఓ పిజ్జాను ఆర్డర్ చేశాడు. ఆర్డర్ చేసి గంట దాటినా పిజ్జా రాలేదు. దీంతో యాప్ కస్టమర్ కేర్ సర్వీస్‌కు ఫోన్ చేస్తే విషయం చెప్పాడు. అటు నుంచి కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌లా మాట్లాడుతూ ఆ రెస్టారెంట్ ఆర్డర్లు తీసుకోవడం లేదని, పిజ్జా కోసం బ్యాంకు ఖాతా నుంచి కట్ అయిన డబ్బులు వెనక్కి వస్తాయని చెప్పాడు. 

 

కాల్ కట్ అయిన తర్వాత మొబైల్‌కు ఓ లింక్ వస్తుందని, దానిపై క్లిక్ చేస్తే డబ్బులు వెనక్కి వస్తాయని నమ్మించాడు. అతడు చెప్పినట్టే షేక్ ఫోన్ పెట్టేయగానే మెసేజ్ వచ్చింది. దీంతో వచ్చిన లింక్‌పై క్లిక్ చేయగానే అతడి బ్యాంకు వివరాలు తెలుసుకున్న సైబర్ నేరగాళ్లు ఆ వెంటనే షేక్ బ్యాంక్ ఖాతా నుండి రూ.45 వేలు దోచేశారు.. అయితే ఆ డబ్బు కట్ అయినట్టు మెసేజ్ వచ్చింది. 

 

దీంతో అప్రమత్తమైన బాధితుడు అందులోని మిగతా డబ్బులను మరో ఖాతాలోకి పంపించాలని అనుకునే లోపే మరో రూ.50 వేలు దోచేశారు.. దీంతో ఆ బాధితుడు వెంటనే సమీపంలోని పోలీసులను ఆశ్రయించాడు. తన తల్లి క్యాన్సర్ చికిత్స కోసం పొదుపు చేసిన డబ్బులను సైబర్ నేరగాళ్లు దోచేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

 

ఇలాంటి ఘటనే ఒక నెల క్రితం చెన్నైలోను జరిగింది. 94 రూపాయిల హైదరాబాద్ బిర్యానీ ఆర్డర్ పెట్టగా అది క్యాన్సిల్ కావడంతో ఆమె కస్టమర్ కేర్ ని సంప్రదించగా హైదరాబాద్ బిర్యానీ కావాలంటే మీకు ఓ మెసెజ్ వచ్చింటుంది ఆ లింక్ పై క్లిక్ చెయ్యండి అంటూ చెప్పగా ఆమె క్లిక్ చేసిన వెంటనే అందులో 54వేల రూపాయిలు కొట్టేసారు సైబర్ నేరగాళ్లు. చూసారుగా ఇప్పుడైనా కాస్త జాగ్రత్తగా ఉండండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: