నోట్ల రద్దు.. దేశాన్ని ఒక్కసారిగా ఆశ్చర్యంలో ముంచిన ఘటన. అందుబాటులో ఉన్న కరెన్సీని 80 శాతం ఉన్నపళంగా రద్దు చేసిన సంచలనాత్మక చర్య. ఈ చర్యపై కొన్ని నెలల పాటు చర్చలు జరిగాయి. ఏదేమైనా దేశం బాగుపడుతుందన్న నమ్మకంతో జనం కూడా నోట్ల రద్దును స్వాగతించారు. అయితే నోట్ల రద్దు ఆపరేషన్ లో సైన్యం కూడా పాల్గొందట.

 

నోట్ల రద్దు తర్వాత భారీగా నగదును వాయుసేన విమానాల్లో తరలించినట్లు మాజీ ఎయిర్ ఛీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా తెలిపారు. ధనోవా 2016 డిసెంబర్ 31 నుంచి 2019 సెప్టెంబర్ 30 వరకు వైమానిక దళాధిపతిగా పని చేశారు. ఆయన ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ విషయాన్ని బయటపెట్టారు. 2016లో నోట్ల రద్దు తర్వాత దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు వైమానిక దళం సాయంతో దాదాపు 625 టన్నుల బరువున్న కొత్త కరెన్సీ కట్టలను చేర్చారట.

 

దీనికోసం ఐఏఎఫ్ 33 మిషన్స్ ను చేపట్టినట్లు వివరించారు. కోటి రూపాయల బరువు 20 కేజీలు ఉండవచ్చని ఆయన అంచనా వేసారు. అయితే ఎంత డబ్బు వెళ్లిందో తనకు తెలియదని చెప్పారు. రఫేల్ వివాదంపైనా ఆయన స్పందించారు. అభినందన్ వర్థమాన్ కనుక రఫేల్ లో వెళ్లి ఉంటే పరిస్థితి మరో రకంగా ఉండేదని ఆయన వ్యాఖ్యానించారు. బోఫోర్స్ శతఘ్నులు కొనుగోలు చేసినప్పుడు కూడా వివాదాస్పదమైందని గుర్తు చేశారు. బోఫోర్స్ శతఘ్నులు అద్భుతంగా పని చేస్తున్నాయని ధనోవా అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: