ప్రకృతి సిద్ధంగా తాటి , ఈత చెట్ల నుంచి కల్లు వస్తుందని మీరు భావిస్తున్నారా? ఆరోగ్యానికి మంచిదని రోజూ తాగేస్తున్నారా? అయితే జాగ్రత్త..?  నిషా కోసం డబ్బులు పెట్టి మీరు రోజు తాగుతున్నదంతా అసలు కల్లే కాకపోవచ్చు..? నల్గొండ జిల్లాలో కల్తీ కల్లు మాఫియా గుట్టు రట్టుతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 

 

నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో కల్తీ కల్లు మాఫియా రాజ్యమేలుతోంది.  మూసీ రోడ్ లో కందగట్ల శ్రీకాంత్ సాయి అనే వ్యక్తి జనరల్ స్టోర్‌ పేరుతో....లోపల నయా దందా సాగిస్తున్నాడు. కల్తీకల్లు తయారీకి ఉపయోగించే  మత్తు పదార్థాలతో వ్యాపారం చేస్తున్నాడు. ప్రమాద కరమైన రసాయనాలతో కల్తీ కల్లు తయారీ అమ్మకాలు చేస్తూ.. అక్రమ దందా సాగిస్తున్నాడు.  లోకల్ పోలీసుల అండ దండలతోనే ఈ మాఫియా సాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

 

అధికారులు, ప్రజా ప్రతినిధులకు గోవా ట్రిప్పులు, స్టార్ హోటల్స్‌లో పార్టీలు ఇచ్చి... శ్రీకాంత్ కల్తీ కల్లు బిజి నెస్‌కి ఎలాంటి ఆటంకం లేకుండా చేసుకునే వాడనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం మద్యం ధరలు పెంచడం, గుడుంబా అమ్మకాలు నియంత్రించడంతో కల్లుకు డిమాండ్ వచ్చింది. 

 

కొన్నేళ్ళుగా కల్తీ కల్లు మాఫియాకు నకిరేకల్ కేంద్రంగా మార్చుకున్నాడు శ్రీకాంత్.  కల్తీ కల్లు తయారీకి వాడే డైజో ఫామ్, క్లోరల్ హైడ్రేడ్ ,సిట్రిక్ యాసిడ్ ను శ్రీకాంత్ విచ్చల విడిగా అమ్ముతుంటాడు. ఇక్కడ విక్రయించిన మత్తు పదార్ధాలు నల్గొండ, ఖమ్మం, హైద్రాబాద్ తో పాటు ఇతర ప్రాంతాల్లోని కల్లు కంపౌండ్ లకు సరఫరా అవుతుంటాయి. మందు బాబులకు ఏ మాత్రం డౌట్ రాకుండా...కలర్,టేస్ట్ కోసం కొన్ని కెమికల్స్ మిక్స్ చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. కల్తీ కల్లు మాఫియా ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇతర రాష్ట్రాలకు విస్తరించేలా అనుచరులనూ ఏర్పాటు చేసుకున్నాడు. 

 

లిక్కర్ మాఫియాపై సీరియస్‌గా దృష్టిపెట్టిన ఎక్సైజ్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు...పక్కా సమాచారంతో శ్రీకాంత్ నిర్వహిస్తున్న జనరల్ స్టోర్‌పై దాడి చేశారు. నాలుగు లక్షల విలువ చేసే డైజో ఫామ్, 300 కేజీల క్లోరల్ హైడ్రేడ్ , సిట్రిక్ యాసిడ్‌లను స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాంత్‌తో పాటు మరొకరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

 

 కల్తీ కల్లు తాగి ఎంతోమంది ప్రాణాల మీదకు తెచ్చుకున్నారని స్థానికులు చెబుతున్నారు. రాజకీయ నాయకుల పైరవీలు.. మామూళ్ల మత్తులో అధికారులు... అక్రమార్కులను అడ్డుకోలేదని తెలుస్తోంది. ఇలాంటి ప్రమాదకరమైన  మత్తు పదార్ధాలతో కూడిన కల్తీ కల్లు తాగడం వల్ల ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. సో మందు బాబులు బీ అలర్ట్.  మీరు తాగుతున్నది అసలు కల్లా కదా తెలుసుకోండి. టేస్ట్ బాగుందని  ఫూటుగా తాగేసి  ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హెచ్చరిస్తున్నారు వైద్యులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: