కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ రెండు తెలుగు రాష్ట్రాలకు మొండిచేయ్యే చూపించింది. ఒక్కటి కూడా కొత్త ప్రాజెక్ట్‌ మంజూరు చేయకపోగా, ఇప్పటికే ఉన్నవాటికి సైతం పెద్దగా కేటాయింపులు లేవు. ప్రస్తుతం ఎన్నికలు లేకపోవడంతో పాటు రెండు రాష్ట్రాల ఎంపీలు సైతం పెద్దగా పట్టించుకోకపోవడంతోనే తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యం లేకుండాపోయిందని పలువురు అంటున్నారు. 

 

కొత్తగా ఏర్పడిన ఏపీలో రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయిస్తారని అందరూ భావించారు. అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ కోసం రూ. రూ.1500 కోట్లు మాత్రమే కేటాయించారు. కానీ ఇప్పుడు రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని బడ్జెట్‌లో ఎక్కడా ప్రస్తావించలేదు. అలాగే విభజన చట్టంలో ఇచ్చిన హామీలపై కూడా ఎలాంటి స్పష్టత లేదు. ఏపీకి నిధులు కేటాయించాలని ఇక్కడి ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చిన దాఖలాలు లేవు. దీంతో కనీసం ప్రత్యేక హోదా ప్రస్తావన కూడా రాలేదని పలువురు అంటున్నారు. పోలవరంపై కూడా బడ్జెట్‌లో ఎలాంటి ప్రస్తావన కనిపించలేదు.  

 

విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటు చేస్తామని గతంలోనే ప్రకటించినా ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇప్పుడైనా నిధులు కేటాయిస్తారని అంతా ఆశించినా నిరాశే ఎదురైంది. వాల్తేరును విశాఖ జోన్‌లోనే కొనసాగించాలని, జోన్‌ పరిధిలో సౌకర్యాలు కల్పించాలని, పలు ప్రదేశాలకు నేరుగా రైళ్లు వేయాలని కోరినా ఆ విషయంలో ఎలాంటి ప్రస్తావన లేకుండా పోయింది. విశాఖపట్నం, విజయవాడలో మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌పై కూడా ఎలాంటి ప్రకటన లేదు. విశాఖ-–చెన్నై పారిశ్రామిక కారిడార్‌ ఏర్పాటు చేస్తామని బీజేపీ నేతల ఎప్పటి నుంచో చెబుతున్నా కేంద్రం నుంచి ఎలాంటి హామీ రాలేదు. గుంటూరు రైల్వే డివిజన్‌ పరిధిలోని నడికుడి-–శ్రీ కాళహస్తి  రైల్వేలైను ఏర్పాటు పనులు భూసేకరణ దశకొచ్చినా పరిహారాలు ఇవ్వలేదు.

 

తెలంగాణకు పన్నుల వాటా, గ్రాంట్లు తప్ప కేంద్రం అదనంగా ఇస్తున్న నిధులు ఏమీ లేవు. విభజన నాటి హామీలు అమలుకాకపోగా, నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటుకు బీజేపీ హామీ ఇచ్చినా ఇప్పుడు ఎలాంటి ప్రకటన లేదు. ఇక రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ, కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల నిర్వహణకు వచ్చే ఐదేళ్లలో రూ.52,941 కోట్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ కోరినా కేంద్రం నుంచి ఉలుకూ పలుకూ లేదు. కాజీపేటలో రైల్వే వ్యాగన్‌ కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో కోరుతున్నా కేంద్రం పట్టించుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: