క‌రోనా వేర‌స్‌.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు గ‌జ‌గ‌జ వ‌ణికేలా చేస్తుంది. చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను క్రమక్రమంగా కమ్మేస్తోంది. కరోనా దెబ్బకు ప్రపంచం అబ్బా అంటోంది. ఈ క్రమంలో కరోనా బారిని పడి మరణిస్తున్నవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. క‌రోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు దాదాపుగా ప్రపంచ దేశాలన్నీ విశ్వప్రయత్నం చేస్తున్నప్పటికీ దీని తీవ్రత పెరుగుతూనే ఉంది. దేశాల మధ్య సరిహద్దులు మూతపడ్డాయి.

ఈ వైర‌స్ కార‌ణంగా దాదాపు 100 కోట్ల మంది ఇళ్లకే పరిమితమైపోయే పరిస్థితి తలెత్తింది. ఇక కరోనా వైరస్ ప్రభావం దేశంలోని అనేకరంగాలపై భారీగానే పడింది. దీంతో కరోనా వైరస్ ఒక ప్రాణాంతక వైరస్ మాత్రమే కాక... ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలను నాశనం చేసే చీడపురుగుగా కనిపిస్తోంది. ఇక  పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో సోమవారం స్టాక్‌మార్కెట్లు ఒక్క‌సారిగా కుప్పకూలాయి. ఇన్వెస్టర్లు పానిక్‌ సెల్లింగ్‌కు దిగడంతో మార్కెట్‌లో మరో మహాపతనం నమోదైంది.

ఓ దశలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ పదిశాతంపైగా పతనమవడంతో ట్రేడింగ్‌ను 45 నిమిషాల పాటు నిలిపివేశారు. ఇక బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 3934 పాయింట్ల నష్టంతో 25,981 పాయింట్ల వద్ద ముగియగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 1136 పాయింట్లు పతనమై 7610 పాయింట్ల వద్ద ముగిసింది.  ఒక్కరోజులో కీలక సూచీలు ఈ స్ధాయిలో పతనమవడం ఇదే మొద‌టిసారి కావడం గమనార్హం. స్టాక్‌మార్కెట్లు పాతాళానికి దిగజారడంతో ఒక్కరోజులోనే రూ 13.88 లక్షల కోట్ల మదుపుదారుల సంపద ఆవిరి అయిన‌ట్టు తెలుస్తోంది. ఏదేమైనా క‌రోనా ప్ర‌భావం ఇలాగా కొన‌సాగితే ముందు ముందు మ‌రిన్ని భారీ న‌ష్టాలు చ‌విచూడాల్సి వ‌స్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: