లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా అరెస్టుకు మ‌ళ్లీ అడ్డంకులు ఎదుర‌వుతున్నాయి. వాస్త‌వానికి మాల్యా అప్ప‌గింత‌కు అడ్డంకుల‌న్ని తొల‌గియ‌ని, బ్రిట‌న్ ప్ర‌భుత్వం కూడా  భారత్‌కు అప్పగించేందుకు అంగీక‌రించింద‌ని భార‌త విదేశాంగా శాఖ అధికారులు బుధ‌వారం ప్ర‌క‌టించారు.  దీంతో వెంటనే అధికారులు అతనితో కలిసి ఇండియాకు బయలుదేరి వస్తారని అనుకుంటున్న త‌రుణంలో చట్టంలో ఉన్న నిబంధనల దృష్ట్యా  మాల్యాను  ఇప్పుడే  భారత్‌కు పంపలేమని బ్రిటిష్ హై కమిషన్ చ‌ల్ల‌గా క‌బురు చెప్పింది.  ఇదిలా ఉండ‌గా ఏంటా చ‌ట్టం..ఎందుకు అడ్డుప‌డుతోంద‌న్న‌దానికి మాత్రం బ్రిటిష్ హై కమిషన్ వివ‌ర‌ణ ఇవ్వడానికి ఇష్ట‌ప‌డ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.


 అది రహస్యమని, యూకే లా ప్రకారం ఆ సమస్య పరిష్కరించాకే మాల్యాను దేశం దాటిస్తామని స్పష్టం చేయ‌డం విశేషం.  మొత్తంగా మాల్యా ఇప్పట్లో భారత్‌కు రావడం మాత్రం ఆగిపోయిన‌ట్లేన‌ని అర్థ‌మ‌వుతోంది. లండన్‌ కోర్టుల్లో ఎదురుదెబ్బ తగలగడంతో మాల్యాను భారత్‌కు తీసుకొచ్చి ముంబై ఆర్ధర్ రోడ్డులోని సెంట్రల్‌ జైలుకు తరలిస్తారని వార్తలు వచ్చాయి. కానీ యూకే చట్టం మాల్యాకు చుట్టంలా మారింద‌ని నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. విజయ్‌మాల్యా భారత్‌లోని వివిధ‌ బ్యాంకులకు రూ.10వేల‌కోట్లు ఎగ్గొట్టి బ్రిట‌న్‌కు పారిపోయిన విష‌యం తెలిసిందే. అత‌డిని ఇండియాకు తీసుకురావ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం విశ్వ ప్ర‌య‌త్నం చేస్తోంద‌నే చెప్పాలి. అయితే బ్రిట‌న్‌లోని చ‌ట్టాలు మాల్యాకు అనుకూలంగా మారుతున్నాయి. 


గత నెలలో తనను భారత్‌కు అప్పగించడాన్ని సవాల్‌ చేస్తూ యూకె సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలుకు అవకాశం ఇవ్వాలని మాల్యా యూకె హైకోర్టును కోరారు. అయితే మాల్యా అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. దీంతో విజయ్‌ మాల్యాను భారత్‌కు తీసుకురావడానికి అనుమతి లభించినట్లేనని అంతా భావిస్తున్న త‌రుణంలో బ్రిటిష్ హై క‌మిష‌న్ ట్విస్ట్ ఇచ్చింది. ఇదిలా ఉండ‌గా
మాల్యా దేశంలోకి రాగానే  ఏ విధంగా విచారించాలో వ్యూహాలు రచిస్తున్నట్లు సీబీఐ, ఈడీ అధికారులు తెలిపారు. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ మూతపడడం, ఎయిర్‌లైన్స్‌ సంస్థ తరఫున తీసుకున్న సుమారు రూ.9,000 కోట్ల రుణాలను చెల్లించకపోవడంతో.. మాల్యాపై మనీలాండరింగ్, మోసపూరిత అభియోగాలతో సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: