ప్రపంచ దిగ్గజ సోషల్ మీడియా సంస్థ ఫేస్ బుక్ కు భారీగా నష్టం వాటిల్లింది.  ఫేస్‌బుక్ ఐఎన్‌సీ, దాని అనుబంధ సంస్థల్లో ప్రకటనలు ఇవ్వబోమని వ్యాపారసంస్థలు ప్రకటించడంతో ఆ కంపెనీ ఇంతలా నష్టపోయింది. అంతేకాకుండా కంపెనీ షేర్లు శుక్రవారం 8.3 శాతం పడిపోయాయి. అమెరికాలోని డిజిటల్‌ ప్రకటనల మార్కెట్‌లో ఫేస్‌బుక్ సంస్థకు దాదాపు 23 శాతం వాటా ఉంది. ఫేస్‌బుక్ కు మూడు  బిలియన్లమంది యూజర్లు ఉన్నారు. గత ఏడాది ఆ సంస్థ డిజిటల్‌ యాడ్స్‌ ఆదాయం 27 శాతం పెరిగి సుమారు 70 బిలియన్‌ డాలర్లకు చేరింది. తప్పుడు సమాచారాన్ని, ద్వేషపూరిత పోస్టులను కట్టడి చేయడంలో ఫేస్‌బుక్ విఫలమైందన్న నెపంతో వ్యాపారసంస్థలు ప్రకటనలు ఇవ్వడాన్ని విరమించుకున్నట్లు ప్రకటించాయి.


 ప్రపంచంలో వాణిజ్య ప్రకటనలు అధికంగా ఇచ్చే యూనీలివర్ సంస్థ కూడా ఈ నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటించడంతో ఇంత మొత్తంలో నష్టపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఫేస్‌బుక్ షేరు నిన్న 8.3 శాతం పడిపోయింది. విద్వేష పూరిత ప్రసంగాలను ఫేస్‌బుక్‌ సరిగ్గా కట్టడి చేయట్లేదని ఇటీవ‌ల సొంత సంస్థ ఉద్యోగులే ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం తెలిసిందే. అలాగే స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌కుండా..ఆరోప‌ణ‌ల నుంచి త‌ప్పించుకుంటున్నారంటూ కొంత‌మంది ఉద్యోగులు బ‌య‌ట‌కు కూడా వెళ్లిపోవ‌డం చ‌ర్చ‌నీయాశంగా మారింది. జాతి విద్వేషాల అల‌ర్ల స‌మ‌యంలో ఫేస్‌బుక్‌పై అమెరికాలో ఇటీవల విమర్శలు అధికమయ్యాయి.


ఈ ప‌రిణామ క్ర‌మంలోనే  పలు కంపెనీలు ప్రకటనలు నిలిపివేయడంతో ఫేస్‌బుక్ షేరు నిన్న 8.5 శాతం పడిపోయింది. రానున్న కాలంలో ఆర్థికంగా సంస్థ ఒడిదుడుకులు ఎదుర్కొంటుందేమోన‌న్న విశ్లేష‌ణ‌లు మొద‌ల‌య్యాయి. ఇదిలా ఉండ‌గా ఈ నేపథ్యంలో ఫేక్ న్యూస్ పై ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ స్పందిస్తూ... అన్ని రకాల ఓటింగ్ సంబంధిత పోస్టులకు కొత్త ఓటరు సమాచారం అనే లింకును జోడిస్తామని తెలిపారు. విద్వేషపూరిత వ్యాఖ్యలపై మరింత కఠినంగా వ్యవహరించనున్నామని, రాజకీయ నాయకులు కూడా వీటి నుంచి తప్పించుకోలేరని ఆయన వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: