క‌రోనా వైరస్ కేసులు రోజు రోజుకూ పెరుగుతుండటం, మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారనే ప్రచారం జ‌రుగుతుండ‌టంతో  హైదరాబాద్ నుంచి జ‌నాలు సొంత ఊళ్ల‌కు వెళ్లిపోతున్నారు. ఇప్ప‌ట్లో హైద‌రాబాద్‌కు రాబోము అని కూడా చెబుతున్నారు. విద్య‌, ఉద్యోగ‌, ఉపాధి అవ‌స‌రాల నిమిత్తం హైద‌రాబాద్‌కు వ‌ల‌స వ‌చ్చిన వారు ఇప్పుడు మ‌ళ్లీ సొంత ఊరి బాట ప‌ట్టారు. క‌రోనా ఇప్ప‌ట్లో త‌గ్గే సూచ‌న‌లు క‌న‌బ‌డ‌క‌పోవ‌డంతో క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. పూర్తిగా స్థిరపడిన వారు మాత్రమే ఉండటానికి మొగ్గు చూపుతుండగా.. అద్దె ఇళ్లలో ఉంటూ.. ఆదాయం కోల్పోయిన వారు నగరంలో ఖర్చులు భరించలేకపోతున్నారు. సొంతూరు వెళ్తే ఏదో ఒక పని చేసుకొని బతకొచ్చనే ఉద్దేశంతో నగరాన్ని వీడుతున్నారు. దీంతో నగరంలోని చాలా కాలనీల్లో టు-లెట్ బోర్డులు దర్శనం ఇస్తున్నాయి.

 

కరోనా వైరస్‌ వ్యాపార వర్గాల్లో కల్లోలం సృష్టిస్తోంది. చిన్న వ్యాపారులను కోలుకోలేని విధంగా దెబ్బ తీస్తోంది. దాదాపు రెండున్నర నెలలు దుకాణాలు, షాపింగ్‌మాల్స్‌, కాంప్లెక్స్‌లను మూసివేయడంతో అన్ని రకాల వ్యాపారాలు మందగించాయి. ఇప్పుడు వాటిని తెరిచినా పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. ప్రజల చేతుల్లో డబ్బుల్లేవు. నగరంలో చాలామందికి ఉపాధి లేదు. ఎక్కడో కొంత పని దొరికినా ఇంతకు ముందులా జీతాలు రావడం లేదు. వచ్చినవి ఇంటి అద్దెకు, కుటుంబ పోషణకు కూడా సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో ప్రజలు నిత్యావసరాలు తప్పితే ఇంకేమీ కొనడం లేదు. దీంతో వస్త్ర దుకాణాలు, జ్యువెలరీ షాపులు, స్టేషనరీ షాపులు, బొటిక్‌లు, ఇలా అన్నీ మూతపడుతున్నాయి.

 

వాస్త‌వానికి హైద‌రాబాద్‌లో పరిస్థితులు కరోనాకు ముందు.. తర్వాతలా మారాయి. ఇంతకాలం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిన అద్దె ఇళ్ల సంబరం.. ఇప్పుడు యజమానులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. హైదరాబాద్‌లో భారీగా డిమాండ్‌ ఉండే అద్దె గృహాలు కొవిడ్‌ కారణంగా టు లెట్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. నాడు విద్య, ఉద్యోగ, ఉపాధి కోసం నగరాలకు వచ్చే వారి సంఖ్య భారీగా ఉండటంతో యజమానులు అద్దె ధరలు అమాంతం పెంచేశారు. ఇటీవల గత మూడు నెలలుగా సరైన అద్దెలు లేక అవస్థలు పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: