భార‌త్‌లో నిరుద్యోగం ర‌క్కసి పెరిగిపోతోంది. క‌రోనా ఎఫెక్ట్ అన్ని రంగాల‌పై కొన‌సాగుతోంది. పారిశ్రామిక‌, సేవా రంగాలు కుదేల‌య్యాయి. వివిధ సెక్టార్ల‌లో ల‌క్ష‌లాది ఉద్యోగాలు గ‌ల్లంత‌య్యాయి. చిన్న‌, మ‌ధ్య‌, పెద్ద సంస్థ‌ల్లో కూడా ఉద్యోగాలు గాలిలో దీప‌మైంది.  కరోనా కారణంగా లాక్‌డౌన్ ఆంక్ష‌లు కొన‌సాగుతుండ‌గా..స్వ‌త‌హాగా జాగ్ర‌త్త చ‌ర్య‌లు, పొదుపు చ‌ర్య‌ల్లో భాగంగా సంస్థ‌లు సిబ్బందిని కుదేంచేస్తుండ‌టం గ‌మ‌నార్హం. వివిధ రంగాల్లో అనేక మంది ఉద్యోగాలు కోల్పోయారు. లాక్‌డౌన్‌ ప్రభావం అసంఘటిత రంగంపై తీవ్రంగా పడింది. మార్చి ఒకటో తేదీ నాటికి దేశంలో నిరుద్యోగం 7.91 శాతమే ఉండగా అనేక రంగాల్లో ఉపాధి, ఉద్యోగాలు కోల్పోయి అది 23.56 శాతానికి చేరుకుంది.


ఏప్రిల్‌ ఒకటో తేదీ నాటికి 9 శాతం ఉన్న నిరుద్యోగం మార్కెట్‌ పరిస్థితులు దిగజారిపోవడంతో 25 రోజుల్లో 14 శాతం నిరుద్యోగం పెరిగింది. ప్రస్త్తుతం 23.56 శాతం ఉన్న నిరుద్యోగం ఈ నెలాఖరుకు 26 శాతానికి చేరుకుంటుందని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ అంచనా వేసింది. మార్చి ఒకటో తేదీన పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం 8.63 శాతం ఉంటే ఏప్రిల్‌ 25వ తేదీ నాటికి 25.46 శాతానికి చేరుకుంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో 7.58 శాతం నుంచి 22.71 శాతానికి పెరిగింది. మార్చి 22న ప్రకటించిన లాక్‌డౌన్‌ ప్రభావం ఆ నెలలో కనిపించకపోయినా వారం రోజుల తర్వాత ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి తన ప్రభావాన్ని భారీగా చూపింది.

 

అర్బ‌న్ ప్రాంతాల్లో లాక్‌డౌన్ వ‌ల్ల విధిస్తున్న‌ క‌ఠిన ఆంక్ష‌ల వ‌ల్ల‌ ప‌ట్ట‌ణాల్లో నిరుద్యోగుల సంఖ్య‌ 11.26 శాతానికి ఎగ‌బాకింద‌ని సెంట‌ర్ ఫ‌ర్ మానిట‌రింగ్ ఇండియ‌న్ ఎకాన‌మీ(సీఎంఐఈ) అధ్య‌య‌నం తెలిపింది. ఈ అధ్య‌య‌నం ప్ర‌కారం గ‌త నాలుగువారాలుగా త‌గ్గుముఖంగా ఉన్న‌ పట్ట‌ణ నిరుద్యోగిత జూలై 5 నాటికి 10.69 నుంచి 11.26 శాతానికి పెరిగింది. ఈ పెరుగుద‌ల క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు, అస్సాం, ప‌శ్చిమ బెంగాల్‌, మ‌హారాష్ట్ర‌లో అధికంగా ఉన్న‌ట్లు స‌ర్వేలో పేర్కొంది. నిరుద్యోగం శాతం ఇలానే పెరుగుతూ పోతే భార‌త్‌లో అనేక మంది భ‌విష్య‌త్ ప్ర‌శ్నార్థ‌కంగా మారుతుంద‌ని, ఇది సమాజంలోని పెడ ధోర‌ణుల‌కు దారి తీస్తుంద‌ని సామాజిక విశ్లేష‌కులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: