వరుసగా ఐదోరోజు దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో బజాజ్ ఫినాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌సీఎల్, ఏషియన్ పెయింట్స్ షేర్లు అధిక లాభాలను నమోదు చేయగా, ఎన్‌టీపీసీ, ఐటీసీ, పవర్‌గ్రిడ్, టాటా స్టీల్, ఓఎన్‌జీసీ, ఎంఅండ్ఎం, బజాజ్ ఆటో, భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. యూఎస్, యూరప్ మార్కెట్లు లాభాలను నమోదు చేయడంతో ఆ ప్రభావం దేశీయ మదుపర్ల సెంటిమెంట్‌ను బలపరిచిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.  మిడ్ సెషన్ తర్వాత ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడంతో మార్కెట్లు కొంత ఒడిదుడుకులకు లోనైనప్పటికీ చివర్లో లాభాల్లో ముగిశాయి. 

 

ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇవ్వడంతో సెన్సెక్స్ 187.24 పాయింట్లు లాభపడి 36,674 వద్ద ముగియగా, నిఫ్టీ 36 పాయింట్ల లాభంతో 10,799 వద్ద ముగిసింది. రంగాల వారీగా చూస్తే, నిఫ్టీలో ప్రైవేట్ బ్యాంక్, ఐటీ రంగాలు లాభాలను నమోదు చేయగా, మెటల్, రియల్టీ రంగాలు కొంత డీలాపడ్డాయి. ఇదిలా ఉండ‌గా కొవిడ్-19 పరిణామాలను ఎదుర్కొంటున్న సవాళ్ల మధ్య భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి బౌన్స్ బ్యాక్ అవుతుందని నీతి అయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ అన్నారు. మంగళవారం ఫిక్కీ ఈ-ఫ్రేమ్స్ కార్యక్రమంలో "దేశ నిర్మాణంలో సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ పాత్ర" అంశంపై ప్రసంగించిన అమితాబ్ కాంత్... ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవచ్చు. 

 

అలాగే, వృద్ధి సాధించేందుకు, ఉద్యోగ కల్పనకు భారత్‌లో కీలకమైన 12-13 కీలక రంగాలను గుర్తించాలని అభిప్రాయపడ్డారు. ఎలక్ట్రికల్ మొబిలిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్‌చైన టెక్నాలజీ, క్లినికల్ ట్రయల్స్‌ను సరళీకృతం చేయడం, ఔషధ పరిశ్రమలో విలువైన ఉత్పత్తులను కలిగి ఉండటం వంటివి దేశ వృద్ధి రేటు పెరగడానికి సహాయపడతాయని అమితాబ్ కాంత్ తెలిపారు. ఆత్మ నిర్భర్ భారత్ గురించి వ్యాఖ్యానిస్తూ..ఆత్మ నిర్భర్ భారత్ అనేది దేశీయ మార్కెట్‌ను ప్రపంచ స్థాయి ఉత్పత్తులను అభివృద్ధి చేసేందుకు ఉపయోగపడుతుందని' అన్నారు. సృజనాత్మక పరిశ్రమల గురించి స్పందిస్తూ...మీడియా, వినోద పరిశ్రమల వృద్ధికి వేగవంతమైన మార్గాలున్నాయ‌ని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: