ముంబై: స్టాక్ మార్కెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయం. దాదాపు 150 ఏళ్ల షేర్ మార్కెట్ చరిత్రలో తొలిసారిగా బాంబే స్టాక్ ఎక్సేంజ్ భారీ లాభాలను అందుకుంది. దీంతో బీఎస్‌ఈ సరికొత్త రికార్డు నమోదు చేసినట్లైంది. గురువారం ఉద‌యం ట్రేడింగ్ ప్రారంభం కావడంతోనే బీఎస్ఈ సెన్సెక్స్ లాభాలతో మొదలైంది. తొలిసారి ఏకంగా 50 వేల మార్క్‌ను దాటింది. సెన్సెక్స్ 335 పాయింట్లు లాభ‌ప‌డింది. ఆల్‌టైమ్ హై 50,126.73 పాయింట్ల‌ను తాకింది. సెన్సెక్స్ మాత్రమే కాదు.. నిఫ్టీ సూచీ కూడా తొలిసారిగా 14,700 పాయింట్లకు చేరింది. గ‌త సంవత్సరం క‌రోనా మ‌హ‌మ్మారి కారణంగా గ‌త మార్చి నెల‌లో 25,638 పాయింట్ల‌కు ప‌డిపోయిన సెన్సెక్స్‌.. 10 నెలల కాలంలోనే అంత‌కు రెట్టింపు స్థాయికి చేరడం విశేషం.

అమెరికా 46వ అధ్య‌క్షుడిగా జో బైడెన్ ప్ర‌మాణం స్వీకారం చేయడంతో స్టాక్ మార్కెట్లకు కొత్త ఊపు వచ్చింది. దీంతో యూఎస్ఏ స్టాక్ మార్కెట్లతో పాటు ఇతర దేశాల స్టాక్ మార్కెట్లు కూడా లాభాల బాట పట్టాయి. దీని ప్రభావం భార‌త మార్కెట్ల‌పై కూడా పడింది. ఈ నేపథ్యంలోనే బాంబే స్టాక్ ఎక్సేంజ్, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌లు లాభాలతో పరుగులు పెట్టాయి.

అమెరికా నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం అనంతరం స్టాక్ మార్కెట్‌పై మదుపురులు ఆశలు రెట్టింపయ్యాయి. త్వరలో బైడెన్ రకరకాల ఆర్థిక ప్యాకేజీలు ప్రవేశపెడతారనే ఆశతో వారంతా స్టాక్స్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించారు. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టడం, అలాగే వ్యాక్సినేషన్‌పై పాటిజివ్ అప్ డేట్ వస్తుండటంతో షేర్ల కొనుగోలు ఊపందుకుంది.

ఇదిలా ఉంటే కరోనా మహమ్మారి కారణంగా 2020 మార్చిలో స్టాక్ మార్కెట్లు అత్యధికంగా దిగజారిపోయాయి. అంతకుముందు ఎన్నడూ లేనంత దిగువకు సెన్సెక్స్, నిఫ్టీలు చేరాయి. అయితే ప్రస్తుతం గతేడాదితో పోల్చితే 16 శాతం వృద్థితో దూసుకుపోతున్నాయి. 2021 కేంద్ర బడ్జెట్‌‌కు స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టడంపై మదుపరులు తెగ సంబరపడిపోతున్నారు. బడ్జెట్ అనంతరం కూడా మార్కెట్లు ఇలానే కొనసాగాలని ఆశిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: