ముంబై:  ఈ-కామర్స్ రంగంలో రిలయన్స్ అమెజాన్‌కు ప్రధాన పోటీదారు కాబోతోందన్న అంచనాలు ఇప్పటికే మార్కెట్ వర్గాల్లో వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అదే రంగంలో రిలయన్స్ మరో ముందడుగు వేసింది. దీంతో అమెజాన్ కు గట్టి షాక్ తగిలింది. రిలయన్స్-ఫ్యూచర్ గ్రూప్ డీల్ కు స్టాక్ ఎక్సేంజ్ పచ్చ జెండా ఉపడంతో అమెజాన్ కు పెద్ద దెబ్బే తగిలింది. అంతే కాదు రిటైల్ ఆస్తులను రిలయన్స్‌కు అమ్మాలనుకుంటున్న ఫ్యూచర్ గ్రూప్‌ ప్రయత్నాలు ఫలించనున్నాయి. ఈ డీల్ ముందుకు సాగచ్చంటూ భారత స్టాక్ ఎక్సెంజ్‌లు బుధవారం ఆమోద ముద్ర వేశాయి. ఈ ఒప్పందంపై అభ్యంతరాలు, ప్రతికూల అభిప్రాయాలు తమకు లేవని స్పష్టంగా చెప్పాయి. మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి కూడా సమాచారం అందించామని, ఇక నిరభ్యంతరంగా డీల్ ముందుకు సాగచ్ఛని బీఎస్ఈ, ఎన్ఎస్ఈ లు పేర్కొన్నాయి. దీంతో ఈ డీల్ కు అన్ని అడ్డంకులు తొలగినట్లైంది. కాగా.. ఈ ఒప్పందంపై తొలి నుంచీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న అమెజాన్‌కు ఈ పరిణామం మింగుడు పడడం లేదు.


రిలయన్స్‌తో డీల్‌కు సంబంధించి అమెజాన్, ఫ్యూచర్ గ్రూప్ మధ్య కొంత కాలంగా వివాదం నడుస్తోంది. గతంలో అమెజాన్‌తో ఫ్యూచర్ గ్రూప్ చేసుకున్న ఒప్పందంలోని కొన్ని నిబంధనలను ఈ కొత్త డీల్ ఉల్లంఘిస్తోందనేది అమెజాన్ ప్రధాన లెవనెత్తుతున్న అభ్యంతరం. ఈ నేపథ్యంలో అమెజాన్ సంస్థ సింగపూర్ ఆర్బిట్రేటర్‌నూ ఆశ్రయించింది. ఈ క్రమంలో తుది తీర్పు వెలువడే వరకూ రిలయన్స్‌తో డీల్‌ను తాత్కాలికంగా నిలిపివేయాలంటూ ఆర్బిట్రేటర్ గత ఏడాది ఆక్టోబర్‌లో తీర్పునిచ్చింది. అయితే రిలయన్స్‌తో ఒప్పందానికి సంబంధించినంత వరకూ సింగపూర్ ఆర్బిట్రేటర్ తీర్పుకు తాము కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని ఫ్యూచర్ గ్రూప్ వాదిస్తోంది. ఈ నేపథ్యంలో డీల్ నిలిపివేత తీర్పును అమెజాన్ సంస్థ పలు లేఖల ద్వారా సెబీ దృష్టికి కూడా తీసుకెళ్లింది. సింగపూర్ ఆర్బిట్రేటర్ కోర్టులో ఈ డీల్‌కు సంబంధించి వాదోపవాదాలు నడుస్తున్నాయని, ఇలాంటి సమయంలో రిలయన్స్ తో ఫ్యూచర్ గ్రూప్ డీల్ ముందుగు సాగడం నిబంధనలకు విరుద్ధమంటూ గగ్గోలు పెట్టింది.


తాజాగా భారత్ స్టాక్ ఎక్సేంజీలు ఫ్యూచర్-రిలయన్స్ డీల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి.  సెబీతో చర్చించాకే ఈ నిర్ణయానికి వచ్చినట్టు ప్రకటించాయి. ఈ డీల్‌తో పాటు అమెజాన్ వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను కూడా రిలయన్స్‌తో, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్‌తో ఫ్యూచర్ గ్రూప్ పంచుకోవాలని సూచించింది. అమెజాన్-ఫ్యూచర్ డీల్‌కు ఎన్‌సీఏఎల్‌టీ కూడా అనుమతించాల్సి ఉంటుంది. కాగా ఈ పరిణామంపై అమెజాన్ కూడా స్పందించింది. ఈ విషయమై ఇతర చట్టపరమైన మార్గాలను అన్వేషిస్తామని పేర్కొంది. అంతేకాకుండా స్టాక్ మార్కెట్ అనుమతులన్నీ సింగపూర్ ఆర్బిట్రేటర్ తుది తీర్పుపైనే ఆధారపడి ఉంటాయని పేర్కొంది. అందువల్ల అక్కడి తీర్పు ఫ్యూచర్ గ్రూప్ కు వ్యతిరేకంగా వస్తే ఈ డీల్ కూడా రద్దవుతుందని చెబుతోంది. ఏది ఏమైనా ఈ డీల్ పూర్తయితే రిలయన్స్ సంస్థ అమెజాన్ కు సరైన పోటీదారుగా మారుతుందనడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: