ఇంటర్నెట్ డెస్క్: భారతదేశ అతి పెద్ద మొబైట్ నెట్ వర్క్ సంస్థ రిలయన్స్ జియో ఓ ఆఫర్ ప్రకటించింది. తమ ఫీచర్ ఫోన్ వినియోగదారులకు ఏకంగా రెండేళ్ల పాటు ఫ్రీ కాల్స్, ఇంటర్నెట్ సదుపాయాలను అందించనున్నట్లు ప్రకటించింది. రూ.1,999 ధరతో రాబోతున్న రిలయన్స్ జియో ఫీచర్‌ ఫోన్ తీసుకొస్తున్నామని, ఆ మొబైల్‌ను కొనుగోలు చేసిన వారికి ఏకంగా 24 నెలల పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, నెలకు 2 జీబీ డేటా అందించనున్నామని వెల్లడించింది.

ఈ మేరకు ఈ రోజు అధికారికంగా ప్రకటిచింది. దీనితో పాటు రూ.1,499కి లభించే మరో ఫీచర్ ఫోన్ తీసుకురాబోతున్నామని, దానిని కొంటే ఇవే సర్వీసులను 12 నెలల పాటు ఉచితంగా అందిస్తామని తెలిపింది. అయితే ఇప్పటికే జియో ఫీచర్ ఫోన్ వాడుతున్న వారికి కూడా ఈ ఆఫర్ లభిస్తుందని, దాని కోసం తమ నెంబరుకు రూ.749తో రీచార్జ్ చేసినా ఈ ఆఫర్ వర్తిస్తుందని రిలయన్స్ జియో వెల్లడించింది. కస్టమర్లు ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరింది.

ఇదిలా ఉంటే ఇటీవల నెట్‌వర్కింగ్ సంస్థలన్నీ 5జీపై ప్రయోగాలు చేస్తున్న విషయం తెలిసిందే. దేశంలోకి ఏ టెలికం కంపెనీ మొదటగా 5జీ తెస్తుందో ఆ కంపెనీనే నెంబర్ వన్ అనేలా అన్ని టెలికం కంపెనీల మధ్య పోటీ కొనసాగుతోంది. ఒకపక్క రిలయన్స్ జియో దేశీయ టెక్నాలజీతోనే 5జీని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుండగా.. మరో పక్క ఎయిర్‌టెల్.. అమెరికన్ కంపెనీ క్వాల్‌కమ్‌తో కలిసి 5జీ టెక్నాలజీని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.  

అయితే ఫీచర్ ఫోన్లలో 4జీ నెట్‌వర్క్‌ను మాత్రం జియోనే తొలిసారిగా ప్రవేశపెట్టింది. జియో ఫోన్ పేరుతో 2017 జూలైలో ఓ ఫీచర్ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ ఫోన్ అప్పట్లో విపరీతంగా అమ్ముడైంది. ఈ మొబైల్ కాయ్ ఓఎస్‌తో పనిచేస్తుంది. 2.4 అంగుళాల డిస్ప్లే, 2 మెగాపిక్సెల్ రేర్ కెమెరా, 0.3 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో కొన్ని సపోర్టెడ్ అప్లికేషన్లతో ఈ మొబైల్ పనిచేస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: