కరోనా వైరస్‌పై పోరాటంలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన కోవాగ్జిన్ టీకా మరో అడుగు ముందుకు వేసింది. ఇప్పటి వరకు 18 ఏళ్లు పై బడిన వారికి పంపిణీ చేసిన కోవాగ్జిన్ టీకా... ఇకపై పిల్లలకు అందించేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే పిల్లలపై ప్రయోగాలు జరుపుతోంది భారత్ బయోటెక్ సంస్థ. చిన్నారుల కోసం రూపొందించిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ ప్రయోగాలను ఇటీవలే విజయవంతంగా పూర్తి చేసింది భారత బయోటెక్ సంస్థ. ఇందుకు సంబంధించిన పూర్తి స్థాయి నివేదికను ఇప్పటికే భారత ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐకు అందించింది. పిల్లలపై రెండు, మూడో దశ ప్రయోగాలను పూర్తి చేసినట్లు ఇటీవలే భారత్ బయోటెక్ సంస్థ ప్రకటించింది. కోవాగ్జిన్ ఫలితాలపై డీసీజీఐ సంతృప్తి చెంది... అనుమతి ఇస్తే... పిల్లలకు వేసే మొదటి టీకాను తయారు చేసిన సంస్థగా భారత్ బయోటెక్ రికార్డుల్లో నిలుస్తుంది. చిన్నారులపై మొత్తం మూడు దశల్లో ప్రయోగాలు నిర్వహించినట్లు గత నెలలోనే భారత్ బయోటెక్ సంస్థ వెల్లడించింది.

దేశ వ్యాప్తంగా దాదాపు వెయ్యి మంది వాలంటీర్లపై కోవాగ్జిన్ ప్రయోగాలు నిర్వహించినట్లు ఇప్పటికే భారత్ బయోటెక్ సంస్థ సీఎండీ కృష్ణా ఎల్లా ప్రకటించారు. ఇప్పటికే భారత్‌లో కోవిషీల్డ్ వ్యాక్సిన్‌తో పాటు... కోవాగ్జిన్ కూడా అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం కోవాగ్జిన్ వ్యాక్సిన్ తక్కువ మోతాదులో అందుబాటులో ఉందనే అపవాదు వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కోవాగ్జిన్ ఉత్పత్తిని గణనీయంగా పెంచినట్లు కూడా సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ప్రతి నెల తమ భాగస్వామ్య సంస్థలతో కలిసి 10 కోట్ల డోసులు ఉత్పత్తి చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. కోవాగ్జిన్ టీకాను అత్యవసర వినియోగ వ్యాక్సిన కింద ఉపయోగించేందుకు ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశీలిస్తోంది. రోగ నిరోధక శక్తి, భద్రత, సామర్థ్యం విషయాలపై ఇప్పటికే నిపుణుల కమిటీ అధ్యయనం కూడా పూర్తి చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: