భార‌త‌దేశంలో మ‌రోమారు యువ‌త షాక్‌కు లోన‌య్యే ప‌రిణామాలు సంభ‌విస్తున్నాయి. కొత్త ఉద్యోగాల విష‌యంలోనే ఇబ్బందులు ప‌డుతున్న యువ‌త‌కు షాకిచ్చేలా...ఉన్న ఉద్యోగాల‌ను తొల‌గించే ప్ర‌క్రియ సాగుతోంది. అమ్మకాలు లేక వాహన పరిశ్రమ నీరసించిన నేపథ్యంలో రిటైలర్లు నిర్వహణ భారాన్ని తగ్గించుకునేందుకు ఉద్యోగుల్ని తొలగిస్తున్నారు. గత 3 నెలల్లో ఇలా ఏకంగా సుమారు 2 లక్షల ఉద్యోగాలు పోయాయి.  ఈ పరిస్థితులు మెరుగయ్యే అవకాశాలు ఇప్పట్లో కనిపించడం లేదంటున్న ఆటోమొబైల్ డీలర్ సంఘాల సమాఖ్య (ఎఫ్‌ఏడీఏ) రాబోయే రోజుల్లో మరిన్ని ఉద్యోగాలు పోయే వీలుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది.


భార‌త‌దేశ‌ ఆటోమొబైల్ రంగంలో భయంకర పరిస్థితులు నెలకొన్నాయి. భారతీయ ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (ఎస్‌ఐఏఎం) వివరాల ప్రకారం ఈ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో అన్ని విభాగాల్లో హోల్‌సేల్ అమ్మకాలు గతంతో పోల్చితే 12.35 శాతం దిగజారి 60,85,406 యూనిట్లకు పడిపోయాయి. గతేడాది ఏప్రిల్-జూన్‌లో 69,42,742 యూనిట్లుగా ఉన్నాయి. అలాగే ఎఫ్‌ఏడీఏ గణాంకాల ప్రకారం రిటైల్ విక్రయాలూ 6 శాతం క్షీణించి 54,42,317 యూనిట్ల నుంచి 51,16,718 యూనిట్లకు పరిమితమయ్యాయి. గత నెలలో మారుతీ సుజుకీ ప్యాసింజర్ వాహన అమ్మకాలు 36.3 శాతం, హ్యుందాయ్ అమ్మకాలు 10 శాతం పతనమైన విషయం తెలిసిందే. మహీంద్రా అండ్ మహీంద్రా 16 శాతం, టాటా మోటర్స్ 31 శాతం, హోండా కార్స్ 48.67 శాతం దిగజారాయి. జూన్ నెలతో వరుసగా ఎనిమిది నెలలపాటు ప్యాసింజర్ వాహన విక్రయాల్లో మందగమనం కొనసాగగా, మే నెలలో 20.55 శాతం క్షీణత నమోదై 18 ఏండ్లలో కనిష్ఠ స్థాయికి అమ్మకాలు పడిపోయాయి. 


మునుపెన్నడూ లేనివిధంగా అమ్మకాల్లో చోటుచేసుకున్న ఈ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఉద్యోగుల్ని తొలగించడానికే ఆటోమొబైల్ డీలర్లు మొగ్గు చూపుతున్నారు.  దేశవ్యాప్తంగా 15 వేల డీలర్లు 26 వేల ఆటోమొబైల్ షోరూంలను నిర్వహిస్తున్నారు. వీటి ద్వారా ప్రత్యక్షంగా దాదాపు 25 లక్షల మంది, పరోక్షంగా మరో 25 లక్షల మంది ఉపాధిని పొందుతున్నారు. ఏడాదిన్నరగా ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నా.. ఈ ఏడాది మే, జూన్, జూలై నెలల్లో తీవ్రరూపం దాల్చాయని, దీని ప్రభావంతో దాదాపు 2 లక్షల ఉద్యోగాలు పోయాయని విశ్లేషిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: