బతుకమ్మ చీరలతో చేతినిండాపని...జేబు నిండా డబ్బులతో నేతన్నల బతుకు కుదుటపడింది. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ నుంచి ఉపాధి వెతుక్కుంటూ.. ముంబై, సూరత్ లాంటి ప్రాంతాలకు భార్య పిల్లలను వదిలి వెళ్ళిన కార్మికుల పరిస్థితులు ఇప్పుడు మారాయి. బతుకమ్మ చీరల ఉత్పత్తితో తెలంగాణలోనే బ్రాండ్ ఇమేజ్ గా సిరిసిల్ల మారింది.


సిరిసిల్ల బతుకమ్మ చీరలు ప్రత్యేక ఇమేజ్ ను తెచ్చుకున్నాయి. మూడు సంవత్సరాలుగా తెలంగాణ ఆడపడుచులకు సిరిసిల్ల నేతన్నలు నేసిన చీరలను కానుకగా అందిస్తోంది ప్రభుత్వం. ప్రభుత్వం ఇస్తున్న అర్డర్లు నేతన్నలకు ఉపాధినివ్వగా...ఆడపడుచులకు చిరుకానుకగా మారాయి. బతుకమ్మ చీరల్లో విభిన్నమైన మార్పులు తీసుకువస్తూ ప్రత్యేక ఆకర్షణగా మార్చేశారు. ఈ ఏడాది బతుకమ్మ పండుగకు ఆందించే చీరలు కొత్త అందాలను ఒలకబోస్తున్నాయి. చీరలు, జరీపోగుల అందంతో సిరిసిల్ల వాడవాడలా మెరిసిపోతుంది. 2007 సంవత్సరం నుంచి సిరిసిల్ల మరమగ్గాల పరిశ్రమలో చీరల ఉత్పత్తికి ప్రభుత్వం అవకాశం కల్పించింది.


ఈ సంవత్సరం బతుకమ్మ చీరల ఉత్పత్తికి 320 కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయించింది. 6 కోట్ల 70 లక్షల  మీటర్లతో కోటి చీరల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో 26 వేల మరమగ్గాలు ఉండగా 14 వేల మరమగ్గాలపై ఉత్పత్తి జరుగుతోంది. ఉత్పత్తి అయిన బతుకమ్మ చీరలు హైదరాబాద్ తో పాటు ఈ సారి సిరిసిల్లలో కూడా ప్రాసెసింగ్ చేయిస్తున్నారు. సిరిసిల్లలో 2.5 కోట్ల బట్ట ప్రాసెసింగ్ చేసుకోని ప్యాకింగ్ తో సహ సరఫరాకు సిద్దం చేస్తుండడంతో పాటు జిల్లాలకు సరఫరా ప్రారంభించారు. 


అనేక ఆటుపోట్ల మధ్య కొట్టుమిట్టాడిన సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ప్రభుత్వ ఆర్డర్లతో నిలదొక్కుకుంది. గడిచిన నాలుగేళ్ళ కాలంలో కార్మికులకు నిరంతరంగా ఉపాధి ఉండే విధంగా ప్రభుత్వం బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్, రంజాన్, క్రిస్ మస్ సంక్షేమ శాఖలకు సంబంధించిన ఆర్డర్లతో 1600 కోట్ల రూపాయలు అందించింది. ప్రభుత్వ ఆర్డర్లతో సిరిసిల్లలో 13,500 మంది మరమగ్గాల కార్మికులతో పాటు ప్రత్యక్షంగా పరోక్షంగా మరో పదివేల మంది ఉపాధి పొందుతున్నారు. గతంలో కేవలం నెలకు 7వేల రూపాయల వరకు ఉపాధిని పొందే కార్మికులు తెలంగాణ ప్రభుత్వ ఆర్డర్లతో నెలకు 16వేల రూపాయల నుంచి 20వేల రూపాయల వరకు సంపాదిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా సిరిసిల్ల కార్మికులకు చేతి నిండా పని లభించింది. దీంతో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: