బంగారం, డబ్బు, కారు, బైక్ ఇలాంటి వస్తువుల్ని దొంగిలించారని చాలా కేసులు చూసుంటాం. కానీ ఉల్లిపాయలు చోరీ చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయంశమైంది. రోజు రోజుకు ఉల్లి ధరలు పెరిగిపోతున్న తరుణంలో.. బీహార్‌లో జరిగిన ఉల్లి చోరీ  ఘటన తాజా పరిస్ధితికి అద్దం పడుతోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా లక్షలు విలువ చేసే ఉల్లి సరుకుని మాయం చేశారు.  


దేశీయ మార్కెట్ లో ప్రస్తుతం ఉల్లిపాయల ధరలు ఏ రేంజ్ లో ఆకాశాన్ని అంటుతున్నాయో ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. ఉల్లి తరిగేటప్పుడు వచ్చే ఘాటు కంటే.. కొనడానికి చేసే ఖర్చే నషాళానికి అంటుతోంది. రెండువారాల కిందటి వరకూ కేజీ 15 నుంచి 20 రూపాయల వరకు పలికిన ఉల్లి.. ప్రస్తుతం 80 రూపాయలకు చేరుకున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో వాటి ధరలు 100 రూపాయల ల్యాండ్ మార్క్‌కు కాస్త అటూ, ఇటూగా ఊగిసలాడుతున్నాయి. ఉల్లిపాయల ధరలకు ఇప్పట్లో కళ్లెం పడే అవకాశాలు కూడా కనిపించట్లేదు. 


ఈ పరిస్థితుల్లో ఉల్లి పాయలను చోరీ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది బీహారీ దొంగలకు. అనుకున్నదే  తడవుగా ఆచరణలోకి పెట్టేశారు కొందరు చోరులు. అందుబాటులో ఉన్న ఓ ఉల్లి   గిడ్డంగిలో గుట్టు చప్పుడు కాకుండా చోరీకి దిగారు.  ఏకంగా 328 గోనెసంచుల్లో నిల్వ ఉంచిన ఉల్లి బస్తాలను చోరీ చేసేశారు. పట్నాకు 30 కిలోమీటర్ల దూరంలో ఉండే కొల్హార్‌ గ్రామానికి చెందిన ధీరజ్‌ కుమార్‌ అనే వ్యక్తి ఉల్లిపాయల వ్యాపారం చేస్తున్నారు. తాజాగా ఆయన తన గోదాంలో భారీగా ఉల్లిపాయల బస్తాల్ని నిల్వ చేసి పెట్టుకున్నారు. వాటి విలువ సుమారు 8లక్షలకు పైగా ఉంటుందని, ఇవే కాకుండా అల్మారాలోని లక్షా డెబ్బై మూడు వేల నగదును కూడా దోచుకుపోయారని వాపోయాడు బాధితుడు.


సీసీ ఫుటేజీల ఆధారంగా విచారణ ప్రారంభించామనీ.. త్వరలోనే దొంగలను పట్టుకుంటామంటున్నారు పోలీసులు. కనీసం ఎనిమిది మంది వాటిని ట్రక్కుల్లో లోడ్ చేసి ఉండొచ్చని, దీనికోసం దొంగలు మూడు మినీ ట్రక్కులను వెంట తెచ్చుకున్నట్లు ప్రాధమిక నిర్థారణకు వచ్చారు . రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి .. స్థానిక మార్కెట్లలో ఉల్లి సంచులను పరిశీలిస్తున్నారు. ఐతే... ఆ మార్కెట్లలో ఉల్లి సంచులన్నీ ఒకేలా ఉన్నాయి. అన్నీ గోనె సంచులే. అందువల్ల ధీరజ్ ఉల్లిపాయల సంచులు ఏవో కనిపెట్టడం కష్టమవుతోంది. ఏది ఏమైనా... ఇలా ఉల్లిపాయల చోరీ జరగడం కలకలం రేపుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: