దసరా వచ్చేసింది...! ప్రైవేట్‌ ట్రావెల్స్‌ దారి దోపీడీ మొదలైంది...!! రద్దీని క్యాష్ చేసుకుంటూ.. ప్రయాణీకులను దోచేస్తున్నారు. విమాన ఛార్జీలతో పోటీపడుతున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్‌ టికెట్‌ రేట్లు. పండుగకు ఊరెళ్దామనుకున్న వారికి హైదరాబాద్ నగరంలోనే జేబులు గుల్లవుతున్నాయ్‌. 


నగరంలో నిత్యం బిజీగా ఉండే సామాన్యులు.. సొంతూళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులతో.. సన్నిహితులతో సరదాగా గడిపేది పండుగకే. అందుకే దసరా, సంక్రాంతి వస్తుందంటే ఎంతో ఉత్సాహంగా ఉంటారు. కానీ.. వారి సంతోషంపై ఆదిలోనే నీళ్లు చల్లుతున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్‌. ఆర్టీసీ బస్సుల రిజర్వేషన్‌ ఫుల్‌ కావడం, రైళ్లలో రిజర్వేషన్‌ లేకపోవడంతో..చాలా మంది ప్రైవేట్‌ ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. దీంతో ట్రావెల్స్‌ పెద్ద ఎత్తున దోచుకుంటున్నాయ్‌.


ఛార్జీలు పెంచి అసలైన పండగ చేసుకుంటున్నాయి ట్రావెల్స్‌ సంస్థలు. పండగేదైనా దోపీడీయే తమ అభిమతమన్నట్టుగా  ప్రవర్తిస్తున్నారు ట్రావెల్స్‌ నిర్వాహకులు. వారు చెబుతున్న ఛార్జీలు చూస్తే గుండె గుభేల్‌ మనక మానదు.  విమాన ఛార్జీలను మించిపోతున్నాయి బస్ టికెట్ ధరలు. ఆర్టీసీ సైతం పండుగ రద్దీ పేరుతో టికెట్‌ పై 50 శాతం అదనపు ఛార్జీలను వసూలు చేస్తోంది. దీంతో తామేం తక్కువ తిన్నామా అన్నట్లు చెలరేగిపోతున్నాయి ట్రావెల్స్‌. హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ  ప్రాంతాలకు వెళ్లేవారికి ఈ ఛార్జీలు చుక్కలు చూపిస్తున్నాయి. 
ఎక్కువ డిమాండ్‌ ఉన్న రూట్లు.. విజయవాడ, గుంటూరు, ఏలూరు, విశాఖపట్నం, శ్రీకాకుళం, తిరుపతికి సాధారణ రోజుల్‌లో ఏసీ బస్‌ టికెట్‌ 500 వరకూ ఉంటే.. దసరా పేరు చెప్పి 1500 చేశారు. వచ్చే నెల 2 తర్వాత ప్రయాణించాలనుకుంటే మాత్రం టికెట్‌ రేటు 2వేల పైమాటే. 


ఒక కుటుంబంలో నలుగురుంటే.. టికెట్లకే  5వేల నుంచి 10వేలు ఖర్చుచేయాల్సిన దుస్థితి. ఫలితంగా సగటు వేతన జీవులకు దిక్కుతోచడం లేదు. పండగ వేళ కొత్త బట్టలు, ఇంట్లో కొత్త వస్తువుల కొనుగోలుకు తోడు టికెట్ల  బడ్జెట్‌ కలిపి తడిసిమోపెడవుతోంది. హైదరాబాద్‌ నుంచి విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, ఏలూరు, కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, చిత్తూరు, కర్నూలు, కడప, తిరుపతి, బెంగళూరు ప్రాంతాలకు రోజూ 650 నుంచి 700 ప్రైవేట్‌ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి.  పండగ వేళ వీటి సంఖ్య పెరుగుతుంది. ఆ మేరకు బాదుడూ ఉంటుంది. వాస్తవానికి ప్రైవేటు బస్సులన్నీకాంట్రాక్టు క్యారేజీలుగా పర్మిట్లు తీసుకొని.. స్టేజీ క్యారియర్లగా నడుస్తున్నవే. దీనిని ప్రభుత్వం చూసీ చూడనట్లు వదిలేస్తోంది. కనీసం చార్జీల నియంత్రణకైనా చొరవ తీసుకుంటే బాగుంటుందనేది ప్రజల అభిప్రాయం. అది తమ  పనికాదంటున్నారు రవాణా అధికారులు. దీంతో ఊరికి వెళ్లాలనుకుంటే.. ఎప్పుడైనా వెళ్లొచ్చులే అనుకుని పండగ ప్రయాణాన్ని రద్దు చేసుకుంటున్నారు జనం. పండగ ఖర్చులకు తోడు... ఛార్జీలు కలిపి నెల జీతమంతా ఒక్క పండగకే ఖర్చయ్యేలా ఉందనేది సామాన్యుడి ఆవేదన. 


మరింత సమాచారం తెలుసుకోండి: