టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాల వల్ల ఎంతో మందికి సొంతింటి కల నెలవేరింది. ఈ పథకం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినా.. అడుగడున ఆరోపణలు, అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. కొందరు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తామని రూ.లక్షల్లో డబ్బులు కొల్లగొడుతున్నారు. ఇలాంటి ఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

అమాయకులను బురిడీ కొట్టించి మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు కిలేడీలపై సనత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే వీరిలో ఒక్కరిని పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. బోరబండలోని సైట్‌-3కి చెందిన అల్లాకి బందే ఫౌండేషన్‌ డైరెక్టర్‌ ఆయేషా తబస్సుం, మహిళా సంత సొసైటీ ప్రతినిధి సుప్రియ ఇద్దరు స్నేహితులు. డబుల్ బెడ్రూం ఇంటి కోసం వచ్చే వారిని టార్గెట్ చేసుకుని మోసాలకు పాల్పడుతుంటారు. డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి మోసం చేస్తుంటారు.

హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను చూపించి.. ఈ ఇంటిని మీ సొంతం చేస్తామన్నట్లు నమ్మిస్తారు. తమకు కొంత డబ్బులు చెల్లిస్తే చాలని.. డబుల్ బెడ్రూం ఇళ్లు మీ సొంతం అవుతుందని చెబుతారు. అలా ఒక్కొక్కరి నుంచి రూ.20 వేల నుంచి రూ.1.50 వేల వరకు డబ్బులు వసూలు చేస్తుంటారు. నిరాశ్రయులు, పేదవాళ్లైనా మహిళలలనే టార్గెట్ చేసుకుని వారిని ఉచ్చులోకి లాగుతుంటారు. వీరి వలలో పడి మోసపోయిన వారిలో అల్లాపూర్ ప్రాంతానికి చెందిన మహిళలే ఎక్కువగా ఉన్నారు.

అయితే డబ్బులు ఇచ్చి ఇళ్లు రాకపోవడంతో మహిళలందరూ సుప్రియపై ఒత్తిడి పెంచారు. దీంతో సుప్రియ ప్రభుత్వ అధికారిగా తన భర్తను పరిచయం చేసింది. ఇంటి నంబర్లు, విద్యుత్ మీటర్ నంబర్లను చూపించి మరిన్ని డబ్బులు తీసుకున్నారు. ఆ తర్వాత మోసపోయామని తెలిసి నలుగులు బాధితులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అయేషా తబుస్సుంను వారంరోజుల కిందట జగద్గిరి గుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. సుప్రియను సనత్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు వీరిద్దరు 950 మందిని మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. డబుల్ బెడ్రూం ఇళ్లు కావాలనుకుంటే సరైన ధ్రువపత్రాలతో అధికారింగా ఇళ్లను సొంతం చేసుకోవాలని, ఇళ్లు కావాలని ఆశతో మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: