ఇన్ని రోజులు మ‌నం మైన‌ర్ బాలిక‌ని మోసం చేసి పెళ్లి చేసుకున్న సంఘ‌ట‌న‌ల గురించి ఎక్కువ‌గా విన్నాం..చూసాం. కొంత మంది యువ‌కులు 18 ఏండ్లు నిండ‌ని బాలిక‌ల‌కు మాయ‌మాట‌లు చెప్పి లేదా ప్రేమ పేరుతో త‌న‌ను బ‌ల‌వంతంగా పెళ్లి చేసుకోవ‌డం లేదా లైంగిక దాడి చేయ‌డం గురించి ఎక్కువంగా సామాజంలో వింటుంటాం. కానీ ఓ మైన‌ర్ బాలుడిని ట్రాప్ చేసింది ఓ యువ‌తి. అంతే కాకుండా అత‌న్ని బ‌ల‌వంతంగా పెళ్లి చేసుకుంది కూడా. మాయ‌మాట‌లు చెప్పి బ‌ల‌వంతంగా 17 ఏళ్ల బాలుడితో తాళి క‌ట్టించుకుని, త‌రువాత బ‌ల‌వంతంగా స‌న్నిహితంగా కూడా గ‌డిపింది. అనంత‌రం బాలుడు ఫిర్యాదు మేర‌కు యువ‌తిని పోలీసులు పోక్సో చ‌ట్టం కింత అరెస్ట్ చేసిన ఈ సంఘ‌ట‌న త‌మిళ‌నాడులో జ‌రిగింది.


  స్థానిక పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చికి చెందిన ఓ యువతి(19) స్థానిక పెట్రోలు బంకులో పని చేసేది. ఇదే క్ర‌మంలో అదే ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థి 12వ తరగతి చ‌దివేవాడు. త‌న బైక్‌లో పెట్రోలు కోసం తరచూ ఆ బంకు వద్దకు వెళ్లేవాడు బాలుడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ప‌రిచ‌యం కాస్త ప్రేమ‌గా మారింది. త‌రువాత సంవ‌త్స‌రం పాటు పాటు ఆ యువతి, మైనర్‌ బాలుడు జాలీగా కలిసి తిరిగారు. అయితే ఈ విష‌యం తెలుసుకున్న మైన‌ర్ బాలుడి త‌ల్లిదండ్రులు యువ‌తిని ప‌లుమార్లు హెచ్చ‌రించారు. అయినా ఆ యువ‌తి తీరు మార్చుకోలేదు.


ఇదిలావుంటే, ఓ సంద‌ర్భంలో అనారోగ్యానికి గురైన బాలుడు ఆస్పత్రిలో ఉండగా, యువతి దగ్గరుండి సపర్యలు చేసింది. అయితే, ఇదే క్రమంలో కొన్ని రోజుల క్రితం విద్యార్థి డిశ్ఛార్జి అయిన త‌రువాత యువ‌తి పళని ఆలయానికి తీసుకు వెళ్లి పెళ్లి చేసుకుందాం అని చెప్పింది. తల్లిదండ్రులు విడదీయకుండా ఉండాలంటే వివాహం చేసుకోవాలని యువ‌కుడిని నమ్మించింది ఆ యువ‌తి. బ‌ల‌వంతంగా ఆ విద్యార్థితో తాళి కట్టించుకుని, ఆ తర్వాత ఇద్దరూ కోయంబత్తూరు వెళ్లి అక్కడ ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివ‌సించారు. కాగా, ఈ క్రమంలో త‌మ కుమారుడు అదృశ్యమయ్యాడని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. దీంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కోయంబత్తూరు వెళ్లి ఆ ఇద్ద‌ర‌ని పొల్లాచ్చికి తీసుకొచ్చారు.


అయితే, యువ‌తి త‌న‌ను ఆల‌యానికి తీసుకువెళ్లి బ‌ల‌వంతంగా తాలి క‌ట్టించుకుంద‌ని విద్యార్థి చెప్పాడు. త‌రువాత‌ సన్నిహితంగా గడిపినట్లు పోలీసుల‌కు వివ‌రించారు. దీంతో ఆ యువతిని పోలీసులు పోక్సో చట్టం కేసు న‌మోదు చేసి అరెస్టు చేశారు. న్యాయస్థానంలో హాజరుపరిచిన యువ‌తిని అనంత‌రం జైలుకు తరలించారు. విద్యార్థిని నమ్మించి పెళ్లి చేసుకొన్న సంఘటనలో యువతిని అరెస్టు చేయ‌డం ఇదే తొలిసారి అని ఎస్పీ సెల్వనాగరత్నం పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: