విశ్వనగరం హైదరాబాద్‌ను ఐటీ హబ్ అంటారు. అయితే ఇప్పుడు హైదరాబాద్‌ సిటీ టెక్నాలజీతో పాటు గంజాయికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారిందని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరంలో ఇటీవల చోటుచేసుకున్న వ‌రుస ఘ‌ట‌న‌లు అంద‌రినీ ఆశ్చర్య పరుస్తున్నాయి. న‌గ‌రంతో పాటు శివారు ప్రాంతాల్లో పెద్దమొత్తంలో గంజాయి స్వాధీనం చేసుకుని స‌ర‌ఫ‌రా చేస్తున్న వారిని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. ముఖ్యంగా న‌ర్సీప‌ట్నం, వైజాగ్‌ రూర‌ల్, అన్నవ‌రం, రాజ‌మండ్రి, విజ‌య‌వాడ‌, సూర్యాపేట మీదుగా గంజాయిని హైద‌రాబాద్‌కు స్మగ్లింగ్‌ చేస్తున్నట్లు గుర్తించారు. విస్తృతంగా త‌నిఖీలు చేసి భారీగా గంజాయిని పట్టుకున్నారు.

ఇటీవ‌ల ఆరేళ్ల చిన్నారి అత్యాచారం, హ‌త్య మ‌త్తులోనే జ‌రిగిన‌ట్లు  ఆరోప‌ణ‌లు రావడంతో గంజాయి ఇష్యూని హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనరేట్ పోలీసులు సీరియ‌స్‌గా తీసుకున్నారు. ఆయా ఏరియాల్లో స్పెష‌ల్ డ్రైవ్స్, దాడులు జరిపి గంజాయి స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఏడాది హైద‌రాబాద్ క‌మిషన‌రేట్ ప‌రిధిలో మొత్తం 82 కేసులు న‌మోద‌ు కాగా.. దాదాపు 1500 కేజీల గంజాయిని సీజ్ చేశారు పోలీసులు. ఈ కేసుల్లో 239 మంది నిందితులుగా ఉన్నారు. వీరిలో కొంద‌రు ప‌రారీలో ఉన్నట్లు హైద‌రాబాద్ సిటీ పోలీస్ క‌మిషన‌ర్ అంజ‌నీకుమార్ తెలిపారు. 13 మంది కొత్త పెడ్లర్స్‌ని గుర్తించ‌డంతో పాటు 60 మంది స్మగ్లర‌్లలో 21 మందిని అరెస్ట్ చేశారు. వైజాగ్‌తో పాటు ఒడిశాలోని మ‌ల్కన్‌గిరి, ఆంధ్రా-ఒడిశా బోర్డర్, మ‌హారాష్ట్ర నుండి గంజాయి స‌ర‌ఫ‌రా జ‌రుగుతున్నట్లు పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు.

హైద‌రాబాద్ న‌గ‌ర క‌మిషన‌రేట్ ప‌రిధిలో గంజాయి స‌ర‌ఫ‌రా చేసే 24 మందిపై పీడీ యాక్ట్ కింద కేసులు పెట్టారు. వీరిలో హైద‌రాబాద్‌కు చెందిన వారు 18 మంది, ఒడిశాకు చెందిన నలుగురు,  ఏపీకి చెందిన ఇద్దరు ఉన్నారు. అలాగే ఇద్దరు విదేశీయులపైనా ఎండీపీఎస్ యాక్ట్ కింద కేసులు న‌మోదు చేశారు. దాదాపు 600 మందికి పైగా స‌ర‌ఫ‌రాదారుల‌కు కౌన్సిలింగ్ ఇచ్చిన‌ట్లు పోలీస్‌ కమిషనర్‌ అంజ‌నీ కుమార్ తెలిపారు. గంజాయికి బానిస అయిన కాలేజ్ విద్యార్ధులకు కూడా కౌన్సిలింగ్‌ నిర్వహిస్తున్నట్టు సీపీ తెలిపారు.

మొత్తంమీద గంజాయి అంటే హైద‌రాబాద్ కేరాఫ్ అడ్రస్‌గా మారిందనీ, చాక్లెట్లు, బిస్కెట్లు ఎలా దొరుకుతాయో... అంత‌ కంటే ఈజీగా సిటీలో గంజాయి దొరుకుతుందనీ నగరవాసుల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌.. గంజాయిపై ఉక్కుపాదం మోపాలని పోలీస్‌ అధికారులను ఆదేశించారు. దీంతో పోలీస్‌ అధికారులు కూడా గంజాయి స్మగ్లింగ్‌పై నిఘా ఉంచారు. మరి హైదరాబాద్‌లో గంజాయి నిర్మూలనకు పోలీస్‌ అధికారులు చేపట్టిన చర్యలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: