శిల్పా కేసులో మరిన్ని విషయాలు వెల్లడి.. తెలిస్తే షాకే..!
కిట్టి పార్టీల పేరుతో సంపన్న కుటుంబాలకు చెందిన మహిళలను ఆకర్షించి కోట్ల రూపాయలను కొల్లగొట్టిన శిల్పా చక్రవర్తి కేసులో పోలీసులు తవ్విన కొద్దీ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హంగూ, ఆర్భాటాలతో సంపన్నుల కుటుంబాలలోని మహిళలను ఇట్టే స్నేహితులుగా మార్చుకుని శిల్ప రియల్ ఎస్టేట్ వ్యాపారం, విదేశీ వ్యాపారాల్లో పెట్టుబడుల పేరుతో అధిక వడ్డీ ఆశ చూపించి దాదాపు 200 కోట్లు కొట్టేసినట్లు అనుమానిస్తున్నారు. ఇప్పటికే శిల్పకు సంబంధించిన రెండు బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసిన అధికారులు మరిన్ని బ్యాంకులలో ఖాతాలు ఉన్నాయన్న అనుమానంతో ఆరా తీస్తున్నారు.


 పరిచయస్తుల  నుంచి కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్న శిల్పా కొంత మొత్తాలను విదేశాలకు మళ్ళించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తీసుకున్న అప్పులను  చెల్లించకుండా వారిని నమ్మించేందుకు వారం వారం కిట్టీ పార్టీలను  ఏర్పాటుచేసిన శిల్ప, కొత్తవారిని పరిచయం చేసుకుంటూ ఒకరికి తెలియకుండా మరొకరి  నుంచి భారీగా డబ్బులు తీసుకుందని అంటున్నారు. నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఇప్పటివరకు కేవలం మూడు ఫిర్యాదులు మాత్రమే అందినప్పటికీ బాధితుల సంఖ్య ఎక్కువగానే ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. సంపన్నుల కుటుంబీకులు ఫిర్యాదు చేస్తే ఎక్కడ పరువుకు భంగం వాటిల్లుతుందో అన్న ఆందోళనలో ఉన్నారని అంటున్నారు. తీసుకున్న అప్పులు తీర్చడం తలకు మించిన భారంగా మారడంతో ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా విదేశాలకు పారిపోయేందుకు నిర్ణయించుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

 ఒకటి రెండు నెలల్లో విదేశాలకు పారిపోయేందుకు కావలసిన ఏర్పాట్లలో నిమగ్నమైన నేపథ్యంలో శిల్ప అసలు మోసం బయటపడిందని పోలీసులు అంటున్నారు. శిల్పా తో పాటు ఆమె భర్త పాస్పోర్టును స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇదిలా ఉండగా శిల్పా ను కస్టడీలోకి  తీసుకుంటే తప్ప ఎంత మేర మోసం చేశారు, ఎవరికి డబ్బులు ఎంత చెల్లించాల్సి ఉంది, అప్పుగా తీసుకున్న డబ్బులను ఎక్కడ పెట్టారు అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: