రోజు రోజుకు మద్యం మహమ్మారిలా  మారుతున్న‌ది. ప్ర‌జ‌ల ప్రాణాలను బలిగొంటోంది.   వ్యసనపరుల మత్తు.. వారితో పాటు ఇతరులకు కూడా  విపత్తుగా మారుతున్న‌ది.  ముఖ్యంగా మైకం కమ్మేసిన తాగుబోతులు యమకింకరులవుతూ ఉన్నారు. కొందరు తాగి వాహనాలు నడుపుతూ, ప్రమాదాలకు కారణమవుతుండగా.. మ‌రికొందరూ పీకలు తెగ్గోసేంత తెగింపుతో నేరస్తులుగా తయారవుతున్నారు. ఆర్థికంగా చితికిపోయి బజారున ప‌డి.. కుటుంబాలనూ రోడ్డుకెక్కిస్తున్న‌ వారు మరికొందరు.  రాష్ట్రంలో నానాటికీ పెరిగిపోతున్న ఈ వ్యసనం మనిషిని ఆర్థికంగా, నైతికంగా అథఃపాతాళానికి తొక్కేస్తున్న‌ది.

ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా నిత్యం ఎన్ని ప్ర‌మాదాలు చోటుచేసుకుంటూ ఉన్నా కానీ మందుబాబుల్లో మాత్రం మార్పు అనేది క‌నిపించ‌డం లేదు. పీక‌ల‌దాక తాగి త‌మ ప్రాణాల మీద‌కు తెచ్చుకుంటునే అమాయ‌కుల ప్రాణాల‌ను తీసేందుకు కార‌ణ‌మ‌వుతున్నారు. ఈ మ‌ధ్య‌కాలంలో చిన్నారి ర‌మ్య ఉదంతం నుంచి.. వ‌ల‌స కార్మికులు అయోధ్య‌రాయ్‌, దేవేంద్ర‌కుమార్ మ‌ర‌ణం, మ‌రోవైపు అతివేగంతో చెట్టును ఢీ కొట్టి మ‌ర‌ణించిన అబ్దుల్ ర‌హీం, ఎన్‌.మాన‌స‌, ఎం.మాన‌స వంటి వారు ఇంకెంద‌రో మ‌ద్యం మ‌త్తులో ప్రాణాలు కోల్పోయిన వారే. మామూలు స‌మ‌యంలో వాహ‌నాన్ని నిదానంగా న‌డిపే వ్య‌క్తి.. మ‌త్తు త‌ల‌కు ఎక్క‌గానే దూకుడుగా ప్ర‌ద‌ర్శిస్తుంటాడు.  

అయితే మ‌ద్యం సేవించి వాహ‌నాల‌ను న‌డ‌ప‌డం చ‌ట్ట ప్ర‌కారం నేర‌మే. కానీ బ్రీత్ ఎన‌లైజ‌ర్‌తో నిర్వ‌హించే ప‌రీక్ష‌లో తాగిన‌ట్టు తేలినా వివిధ కార‌ణాల వ‌ల్ల వారిపై  పోలీసులు ఎఫ్ఐఆర్  న‌మోదు చేయ‌డం లేదు. శిక్ష‌లో భ‌యం లేక‌పోవ‌డంతో కొంద‌రైతే మ‌ళ్లీ మ‌ళ్లీ అదే త‌ప్పును పునార‌వృతం చేస్తూ ఉన్నారు. తాగి వాహ‌నం న‌డిపి దొరికిన డ్రైవ‌ర్ లైసెన్స్ సస్పెన్ష‌న్‌లో ఉంచాల‌ని కేంద్ర మోటార్ వాహ‌నాల చ‌ట్టం చెబుతున్నా అది అమ‌లుకు మాత్రం నోచుకోవ‌డం లేదు. ముఖ్యంగా హైద‌రాబాద్ న‌గ‌రంలోని   సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోనే 20,739 మంది మద్యం సేవించిన  డ్రైవర్లు మళ్లీ మళ్లీ వివిధ రకాల ఉల్లంఘనలకు పాల్పడినట్లు వెల్ల‌డి అయింది. సైబ‌రాబాద్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో 2020లో 12671 కేసుల్లో కేవ‌లం 1083 మంది రిమాండ్ కాగా.. 6855 కేసులు ప‌రిష్కారం కాలేదు. 2021లో 18,847 కేసులు న‌మోదు కాగా.. రిమాండ్‌ అయిన నిందితులు 1426 కాగా.. 14,450  కేసులు న్యాయ‌స్థానాల‌లో అప‌రిష్కృతంగా ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: