గుజరాత్‌లోని సూరత్‌లో ఉన్న ప్రింటింగ్ మిల్లులో గురువారం తెల్ల‌వారుజామున పెను విషాదం చోటు చేసుకుంది. సాచిన్ ప్రాంతంలోని ఓ ట్యాంకర్ నుంచి కెమికల్ లీకేజీ కావడంతో ఊపిరాడక ఆరుగురు మృతి చెంద‌గా, 20మంది ఆస్ప‌త్రి పాల‌య్యారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. రోడ్డుపక్కన పార్క్ చేసి ఉన్న ట్యాంకర్ పైపు నుంచి గ్యాస్ లీకేజీ అవ‌డంతో ఆ వాయువును పీల్చిన విశ్వప్రేమ్ మిల్లులోని కార్మికులు స్పృహ కోల్పోయి పడిపోయినట్లు స్థానికులు వెల్ల‌డించారు. ఘటనాస్థలికి గుజరాత్ పోలీసులు, అగ్నిమాపక శాఖ చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.


 స‌మాచారం మేర‌కు.. ట్యాంకర్ లో ఉన్న‌ రసాయనాలను కాలువలోకి పోస్తున్నప్పుడు గ్యాస్ లీక్ అయింద‌ని తెలుస్తోంది. దీంతో విషవాయువును పీల్చుకున్న ఆరుగురిలో వెంట‌నే ఐదుగురు ప్రాణాలను కోల్పోయారు, మ‌రొక‌రు త‌రువాత‌ చ‌నిపోయార‌ని సంఘ‌ట‌నా స్థలంలో ఉన్న స్థానికులు వివ‌రించారు. అలాగే, అక్క‌డ ఉన్న 20 మంది కార్మికులు కూడా విష‌వాయువును పీల్చుకోవ‌డం ద్వారా అస్వ‌స్థ‌కు గుర‌య్యారు. వీరిని వెంట‌నే స్థానికంగా ఉన్న ఓ ఆస్ప‌త్రికి త‌ర‌లించిన‌ట్టు అధికారులు వెల్ల‌డించారు. వడోదర నుంచి వచ్చిన డ్రైవర్ ప్రింటింగ్ మిల్లు సమీపంలోని డ్రెయిన్‌లోకి రసాయనాలను అక్రమంగా పడేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు స‌మాచారం.



దీంతో కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు.. ట్యాకర్ డ్రైవ‌ర్‌ను ప‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు తెలుస్తోంది. 2020 సంవ‌త్స‌రంలో గుజరాత్‌లోని ధోల్కాలో చిరిపాల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌లో గ్యాస్ లీక్ అయిన సంఘ‌ట‌న సంభ‌వించింది. ఈ ప్ర‌మాదంలో నలుగురు కార్మికులు మరణించారు.  గుజరాత్‌లోని ధోల్కా తహసీల్‌లోని సిమిజ్-ధోలి గ్రామాల సమీపంలోని చిరిపాల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌లో గ్యాస్ లీక్ సంభవించింది. ఈ ఘ‌ట‌న‌లో ర‌సాయ‌న వ్య‌ర్థాలు ఉన్న ట్యాంకును శుభ్రం చేస్తున్న క్ర‌మంలో న‌లుగురు కార్మికులు మృతి చెందారు. ఈ సంఘ‌ట‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ న‌మోదు చేసుకుని విచార‌ణ చేప‌ట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: