ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరు పల్నాడు ప్రాంతం. నాటి బ్రహ్మనాయుడు మొదలు... నేటి వరకు అదే ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలోని మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. మాచర్ల నియోజకవర్గం పరిధిలోని వెల్దుర్తి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త బ్రహ్మయ్య హత్య ఇప్పుడు మరోసారి తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. మాచర్ల టీడీపీ ఇంఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి ప్రధాన అనుచరుడు బ్రహ్మయ్యను గత రాత్రి గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. వెల్దుర్తి గ్రామానికి చెందిన బ్రహ్మయ్య పొలం నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో దారి కాచిన దుండగులు ముందుగా రాళ్లతో దాడి చేశారు. ఆ తర్వాత అతననిపై కత్తులు, కర్రలతో దాడి చేసి విచక్షణా రహితంగా పొడిచి హత్య చేశారు. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన బ్రహ్మయ్య ఘటనా స్థలిలోనే మృతి చెందాడు.

బ్రహ్మయ్య హత్యతో మాచర్ల నియోజకవర్గం పరిధిలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తన ప్రధాన అనుచరుడిని హత్య చేయడంపై టీడీపీ ఇంఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఓడిపోతామనే భయం ఇప్పటి నుంచి వైసీపీ నేతల్లో ఉందని ఆరోపణలు చేశారు. అందుకోసమే ఇప్పటి నుంచే తమ కార్యకర్తలను, టీడీపీ అభిమానులను, ఓటర్లను భయపెట్టేందుకు ఇప్పటి నుంచే హత్యా రాజకీయాలకు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి వర్గం తెర లేపిందని బ్రహ్మారెడ్డి ఆరోపిస్తున్నారు. బ్రహ్మయ్య హత్య చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బ్రహ్మయ్య హత్య నేపథ్యంలో అటు వెల్దుర్తిలో, ఇటు మాచర్లలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. నియోజకవర్గంలో ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా 144 సెక్షన్ విధించారు. అయితే పోలీసులపై కూడా జూలకంటి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. మాచర్ల నియోజకవర్గం పరిధిలో పోలీసులు పూర్తి పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని.... అందుకు టీడీపీ నేతలపై దాడులే ప్రత్యక్ష ఉదాహరణ అని ఆరోపించారు జూలకంటి బ్రహ్మరెడ్డి. టీడీపీ నేతలపై దాడులకు అంతకంతకు బదులు తీర్చుకుంటామని హెచ్చరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: