ప‌ల్లెటూర్ల‌లో ప‌ట్టింపులు ఎక్కువ అనే మాట త‌రుచూ వింటుంటాం. కానీ ఈ ప‌ట్టింపుల గురించి ఎక్కువ‌గా ప‌ట్టించుకుంటే లేని పోని శ‌త్ర‌త్వాలు పెరుగుతాయే త‌ప్ప మిగిలేది ఏమి ఉండ‌దు అని తాజాగా క‌ర్ణాట‌క రాష్ట్రంలో జ‌రిగిన ఈ సంఘ‌ట‌న రుజువు చేసిన‌ది. క‌ర్ణాట‌క‌లోని హ‌స‌న్ జిల్లా అర్సికెరె తాలుకాలోని పుర్లెహ‌ళ్లి అనే గ్రామానికి చెందిన గిరిష్‌, శ‌ర‌త్‌(28) ఇద్ద‌రు యువ‌కులు వారి కుటుంబాల‌తో క‌లిసి శ‌క‌రాయ‌ప‌ట్నం స‌మీపంలో ఉన్న‌టువంటి చౌడేశ్వ‌రి అమ్మ‌వారి ఆల‌యంలో మొక్కులు చెల్లించుకోవ‌డానికి వెళ్లారు.

ప‌ల్లెటూర్ల‌లో ఇలా ఆల‌యాల‌లో మొక్కులు చెల్లించుకునేందుకు వెళ్లే స‌మ‌యంలో బంధువుల‌ను, స‌న్నిహితుల‌ను పిలుచుకుని చిన్న ఫంక్ష‌న్ చేస్తుంటారు. అయితే గిరిష్‌, శ‌ర‌త్ కూడా వారి కుటుంబాల‌కు స‌న్నిహితులైన వారిని పిలిచారు.  అమ్మవారి వ‌ద్ద పొటేళ్ల‌ను బ‌లిచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. అక్క‌డికీ వెళ్లిన వారంద‌రూ మొక్క‌లో భాగంగా పొట్టేలు కూర వండుకొని భోజ‌నాలు చేసారు. అయితే ఈ కార్య‌క్ర‌మానికి గిరిష్ త‌న బంధువైన న‌ట‌రాజును, అత‌ని కుటుంబాన్ని మాత్రం పిలువ‌లేదు. మొక్కులు చెల్లించుకుని గ్రామానికి చేరుకున్న త‌రువాత ఎవ్వ‌రి ఇండ్ల వ‌ద్ద‌కు వాళ్లు వెళ్లారు. అయితే న‌ట‌రాజు, అత‌ని కుటుంబ స‌భ్యుల‌ను మొక్కులు చెల్లించుకునేందుకు పిల‌వ‌క‌పోవ‌డంపై ఆరోజు ఊర్లో నానా ర‌చ్చ చేసారు. గిరిష్‌, శ‌ర‌త్‌తో ఇరు కుటుంబాల‌తో వాగ్వాదానికి దిగారు.

గ్రామంలో అయిన‌వారంద‌రినీ పిలుచుకుని మ‌మ్ముల్ని ఎందుకు పిలువ‌లేదని, ఎలా మ‌రిచిపోతార‌ని ఘ‌ర్ష‌ణ‌కు దిగారు. ఇరు కుటుంబాల మ‌ధ్య మాటా మాటా పెర‌గ‌డంతో ఊరి పెద్ద‌లు జోక్యం చేసుకుని ఇరు కుటుంబాల‌కు న‌చ్చ‌జెప్పి గొడ‌వ స‌ద్దుమ‌నిగేలా చేసి వారిని పంపించారు. అయితే న‌ట‌రాజు కుటుంబం తీరుపై   ఊరి పెద్దలు  త‌ప్పు బ‌ట్టారు. న‌లుగురిలో అవ‌మానం జ‌రిగింద‌ని భావించి.. న‌ట‌రాజు గిరీస్‌, శ‌ర‌త్‌ల‌పై ప‌గ పెంచుకున్నాడు.

గిరిష్‌, శ‌ర‌త్ ఇంటికి వెళ్లిన న‌ట‌రాజు క్ష‌ణికావేశంలో ఇద్ద‌రిపై క‌త్తితో దాడి చేసాడు. ఈ ఘ‌ట‌న‌లో శ‌ర‌త్‌, గిరిష్‌తో పాటు రాఖేష్‌, యోగేష్ అనే మ‌రొక ఇద్ద‌రు యువ‌కులు కూడా గాయాల‌పాలు అయ్యారు. వీరిలో శ‌ర‌త్ త‌ప్ప మిగతా ముగ్గురిని స‌మీపంలోని ఆసుప‌త్రికి చికిత్స నిమిత్తం త‌ర‌లించారు. దాడిలో తీవ్రంగా గాయ‌ప‌డిన శ‌ర‌త్ ను మెరుగైన చికిత్స కోసం బెంగ‌ళూరుకు త‌ర‌లిస్తుండ‌గా.. మార్గ‌మధ్య‌లో మ‌ర‌ణించాడు. శ‌ర‌త్‌(28) ఏళ్ల కుమారుడు ఉన్న‌ట్టుండి ఇలా ఊహించ‌ని విధంగా ప్రాణాలు కోల్పోవ‌డంతో బాధిత కుటుంబం క‌న్నీరుమున్నీర‌యింది. క‌డుపుకోత మిగిల్చిన నిందితుడు న‌ట‌రాజ్ ను క‌ఠినంగా శిక్షించాల‌ని  శ‌ర‌త్ త‌ల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: