దేవుడు ఆడే వింత నాటకంలో మనిషి జీవితాలు కేవలం కీలుబొమ్మల్లాంటివి మాత్రమే. మనిషి ఒకటి చేయాలనుకుంటే అటు దేవుడు ఒకటి తలుస్తాడు అని అంటూ ఉంటారు. ఇలా ఎన్నో సార్లు అనుకోని విధంగా ప్రాణాలు పోవడం లాంటి ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉంటాయ్. ఒకరి ప్రాణాలను కాపాడాలని అనుకుంటే మరోకరి ప్రాణాలు గాల్లో కలిసిపోతు ఉంటాయి. ఇక్కడ ఇలాంటి ఘటన జరిగింది. రాత్రి పూట విద్యుత్ తీగలు తెగి పడి ఊరంతా భయాందోళనలో మునిగిపోయింది. ఇలాంటి సమయంలోనే ఆరుబయట నిద్రిస్తున్న మనవళ్లకు ఏమయిందో అంటూ కంగారులో ఆ మహిళ పరుగులు పెట్టింది. ఈ క్రమంలోనే విద్యుత్ తీగలు తగిలి చివరికి సజీవదహనం అయింది. ఈ ఘటనతో ఒక్కసారిగా గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ప్రకాశం జిల్లా కుంభం లో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన.


 మండలంలోని లింగాపురం లో మహిళా విద్యుదాఘాతానికి గురై మరణించిన ఘటన అలజడి సృష్టించింది. సయ్యద్ ఫాతిమా అనే 55 ఏళ్ల మహిళ రాత్రి  మనవల్లను నిద్రపుచ్చి  పక్కనే మరో మంచం వేసుకుని పడుకుంది. ఇక వేసవి కాలం కావడంతో చుట్టుపక్కల వారు కూడా బయట నిద్రిస్తున్నారు. అయితే వీరి ఇళ్లకు కాస్త దూరం నుంచే 11 కేవీ విద్యుత్ లైన్ వెళుతోంది. అర్ధరాత్రి సమయంలో విద్యుత్ తీగలు తెగి పెద్దగా మంటలు వ్యాపించాయి. ఫాతిమా మనవళ్ళను వారి బంధువు ఇంట్లోకి తీసుకెళ్లాడు. ఈ విషయం  తెలియని ఫాతిమా మనవళ్ళు ఎక్కడికి వెళ్లారో అని వెతకడం ప్రారంభించింది.  ఈ క్రమంలోనే పొరపాటున విద్యుత్తు తీగ ఆమెకు తగిలింది. దీంతో క్షణాల్లో సజీవదహనం అయిపోయింది. ఇంటి సమీపంలో ఉన్న మరో వృద్ధురాలు నాగేశ్వరమ్మ కు విద్యుత్ తీగలు తగలడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఇక ఈ ఘటనలో మరికొంతమంది కూడా ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: