సినిమాల ప్రభావం జనాలపై ఎంతగా ఉంటుందో నేటి రోజుల్లో ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాము. ఎంతోమంది సినిమాల్లో చూసి అచ్చంగా అలాగే నిజజీవితంలో కూడా ప్రయత్నిస్తున్నారు. మొన్నటికి మొన్న పుష్ప సినిమాలో గంధపు చెక్కల స్మగ్లింగ్ గురించి చూసిన ఎంతోమంది.. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అలాంటి ప్లాన్ వేసి చివరికి పోలీసులకు దొరికిపోయిన ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి అన్న విషయం తెలిసిందే. మరి కొంతమంది ఇక సినిమాల్లో లాగానే తమను తాము హీరోగా భావిస్తూ ఏదో ఒకటి విచిత్రంగా  చేయడం చేస్తూ ఉంటారు. కొంతమంది సినిమాల్లో చూపించే మూఢనమ్మకాలను నమ్ముతూ ప్రాణాలమీదకు తెచ్చుకుంటారు.


 ఇక్కడ జరిగిన ఘటన కూడా ఇలాంటిదే అని చెప్పాలి. ప్రపంచం మొత్తం టెక్నాలజీ వెంట పరుగులు పెడుతున్న సమయంలో మూఢ విశ్వాసాలతో ఎంతోమంది అంధకారంలో కూరుకుపోతున్నారు అని తెలుస్తోంది. ఇక్కడ ఓ యువకుడు ఇలాంటిదే చేసాడు. సినిమా చూసి అలా చేస్తే నిజంగానే మోక్షం లభిస్తుందని నమ్మాడు. చివరికి ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కర్ణాటకలో వెలుగులోకి వచ్చిందని చెప్పాలి. తమకూరు జిల్లా మధుర సమీపంలోని ఓ గ్రామానికి చెందిన ఇరవై రెండేళ్ల రేణుక ప్రసాద్ అనే యువకుడు ఇంటర్ ఫెయిల్ అవడంతో ఇంటి దగ్గర ఖాళీగానే ఉండేవాడు.


 ఏదో ఒక పని చేసుకోవాలని తల్లిదండ్రులు చెప్పినప్పటికీ వినిపించుకోలేదు. అయితే చాలా ఏళ్ళ క్రితం విడుదలైన తెలుగు సినిమాను 25 సార్లు చూసాడు సదరు యువకుడు. కాగా సినిమా చూసి తాను ఆత్మహత్య చేసుకుంటే మోక్షం వస్తుంది అని గట్టిగా నమ్మాడు. సినిమాల్లో చూపించినట్టు గానే పునర్జన్మ ఉంటుందని భావించాడు. ఈ క్రమంలోనే  గ్రామ శివారులో కి వెళ్లి పెట్రోల్ పోసుకొని ప్రాణత్యాగం చేశాడు. ఇదంతా సెల్ఫోన్లో చిత్రీకరించడం గమనార్హం. స్థానికులు మంటలను ఆర్పి ఆసుపత్రిలో చేర్పించినప్పటికీ అతను ప్రాణాలు వదిలాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: