స‌మాజంలో మ‌న గుండెల్ని పిండేసే ఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటున్నాయి. ఉద్యోగ‌, ఉపాధి కోసం పిల్ల‌లు దూర ప్రాంతాల్లో ఉంటున్న నేప‌థ్యంలో వృద్ధులైన త‌ల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. ఎవ‌రితోడూ లేకుండా ద‌య‌నీయ స్థితిలో జీవితం గ‌డుపుతున్నారు. ఆప‌ద స‌మ‌యంలో ఆదుకునేవారు లేక న‌ర‌క‌యాత‌న అనుభ‌విస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్న ఓ ఘ‌ట‌న క‌న్నీళ్లు పెట్టిస్తోంది. భర్త మ‌ర‌ణించి మంచంమీద‌నే పడి ఉన్నా.. మూడు రోజులుగా ఆ శవం వ‌ద్దే ఉండిపోయింది భార్య‌. ఎందుకంటే.. ఆమెకు మ‌తిస్థిమితం లేదు. ఏం జ‌రిగిందో తెలియ‌దు.. భ‌ర్త‌కు ఏమైంద‌న్న విష‌యాన్ని ఆమె గ్ర‌హించ‌లేని ద‌య‌నీయ స్థితి. క‌నీసం ఇరుగుపొరుగు వారికి కూడా చెప్పలేని ప‌రిస్థితి ఆమెది. ఈ ఘ‌ట‌నతో స్థానికులు క‌న్నీటిప‌ర్యంత‌మ‌య్యారు. చివ‌రికి.. క్ర‌మంగా ఇంట్లోంచి భరించలేని దుర్వాసన రావడంతో అనుమానంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు సంగతి వెలుగుచూసింది.

 

పోలీసుల క‌థ‌నం ప్రకారం ప్ర‌కారం వివ‌రాలు ఇలా ఉన్నాయి.. తెలంగాణ‌లోని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో న్యూ హౌసింగ్‌ బోర్డు కాలనీలో రిటైర్డు వీఆర్వో నోముల లింబారెడ్డి (70), నోముల శకుంతల (60) దంపతులు నివసిస్తున్నారు. శకుంతలకు మతిస్థిమితం సరిగా లేదు. ఈనెల 10న న్యూ హౌసింగ్‌బోర్డు కాలనీలోని సొంత ఇంట్లో నోముల లింబారెడ్డి అనారోగ్యంతో మృతిచెందాడు. అయితే భ‌ర్త‌ను కోల్పోయాన‌న్న‌ విష‌యాన్ని తెలుసుకోలేని మతిస్థిమితం లేని అతని భార్య శకుంతల ఎవరికీ చెప్పకపోవడంతో ఆయన శవం కుళ్లిపోయింది. దుర్వాసన వ‌స్తుండ‌డంతో... ఇంటి చుట్టుపక్కల వారు రూరల్‌ పోలీసులకు సమాచార‌మిచ్చారు. వెంట‌నే పోలీసులు ఘ‌ట‌నా పరిశీలించగా కుళ్లిన స్థితిలో వృద్ధుడి మృతదేహం కనపడింది. ఇక‌ లింబారెడ్డి కుమార్తె విదేశాల్లో, కుమారుడు హైదరాబాద్‌లోని నాచారంలో ఉంటున్నారు. వారికి పోలీసులు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టు మార్టానికి పంపి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌తో స్థానికంగా తీవ్ర‌విషాదం నెల‌కొంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: