అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు చేతికందుకొచ్చే సమయానికి మతిస్థిమితం కోల్పోతే ఆ తల్లిదండ్రులు బాధ వర్ణణాతీతం. ఇంట్లో సాయపడతాడు అనుకుంటే ఇంట్లో వల్లే అతనికి కాపలా కాయాల్సి వచ్చింది. ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియక తల్లిదండ్రులు కంటికిరెప్పలా కాపలా కాస్తున్నారు. కానీ అన్ని అనుకున్నట్టు జరిగితే అది జీవితం ఎలా అవుద్దీ.  కన్న కొడుకే నాకు బతకాలని లేదు చచ్చిపోతున్నా అని ఫోన్ చేస్తే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి ? అలాంటి ఘటనే జగిత్యాల జిల్లా లో జరిగింది.

 

 


 వివరాల్లోకి వెళ్తే.... సిరిపురం గ్రామానికి చెందిన పర్స లింగన్న- కళావతి దంపతులకు ముగ్గురు కూతుళ్లు , ఓ కుమారుడు ఉన్నారు . ముగ్గురు కూతుళ్లలో ఇద్దరికి పెళ్లిళ్లు కాగా , కొడుకు కూతురు చదువుకుంటున్నారు . డిగ్రీ మొదటి సంవత్సరం పూర్తి చేసిన కొడుక్కి గత కొద్ది రోజులుగా మతిస్థిమితం సరిగా లేక భిన్నంగా ప్రవర్తిస్తున్నట్లు తల్లిదండ్రులు పోలీసులకు వివరించారు. ఈ క్రమంలోనే ఆదివారం మధ్యాహ్నం జై శ్రీరామ్ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. జీవితం విరక్తి పుట్టిందో లేదా ఎవరైనా ఏమైనా అన్నారో తెలీదు గాని మతిస్థిమితం లేకపోయినా కూడా చనిపోవాలి అని నిర్ణయం తీసుకున్నాడు. మంచిర్యాలలో ఉంటున్న వాళ్ళ అక్కకు ఫోన్ చేసి' అక్కా నాకు బతకాలని లేదు , నేను బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నా'అని చెప్పి ఫోన్ పెట్టేసాడు. తర్వాత ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది.

 

 వెంటనే ఆమె తమ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా , వారు సమీపంలోని బావులన్నింటినీ గాలించారు. దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్థానిక ఎస్సై మనోహర్ రావు సిబ్బందితో పాటు , గ్రామస్తులతో బావుల వద్దకు చేరుకుని గాలించారు. చివరకు ఓ బావి వద్ద బాధితుడి చెప్పులు కనిపించాయి. అనుమానంతో బావిలో గాలించగా మృతదేహాం లభించింది. ఈత రాకపోవడంతో జై శ్రీరామ్ అప్పటికే మరణించాడు. మృతదేహాన్ని బయటకు తీసిన పోలీసులు తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: