నూరేళ్లు కలిసి నడవాల్సిన జంట.. అకాలమరణం చెందడం ఆ గ్రామాన్ని విషాదంలో ముంచింది. కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లిన తన ఇష్టసఖి.. అనుమానాస్పద రీతిలో బావిలో పడి మృతి చెందడాన్ని చూసి తట్టుకోలేకపోయిన ఆ భర్త.. మనస్తాపంతో నీవు లేక నేను లేను అంటూ చితిలో దూకాడు. చుట్టూ ఉన్నవారు రక్షించినా తట్టుకోలేని అతడు.. బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

 

 

పండంటి బిడ్డకు త్వరలో జన్మనిస్తుందని.. తాను నాన్నగా మారబోతున్నానని కలలు కంటున్న ఆ భర్త.. తన సతీమణి ప్రాణాలు కోల్పోవడం చూసి తట్టుకోలేకపోయాడు. అనుమానాస్పదంగా బావిలో మృతురాలై కనిపించిన భార్యను చూసి కన్నీరు మున్నీరుగా విలపించాడు. పెళ్లయిన నాలుగు నెలల్లోనే భార్యా వియోగాన్ని తట్టుకోలేకపోయిన అతగాడు.. తను లేక నేనుండలేనని భావించి భార్య చితిలోకి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. చుట్టూ ఉన్నవారు ఆ సమయంలో రక్షించినా.. అనంతరం బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మహారాష్ట్ర చంద్రాపుర్ జిల్లా తాలోదీ గ్రామంలో జరిగిందీ ఘటన. నవదంపతుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

 

 

ఇదీ జరిగింది

తాలోది గ్రామంలో రుచితా చిట్టావర్, కిషోర్ ఖాతిక్‌.. మార్చి 19న కుటుంబసభ్యుల మధ్య ఘనంగా వివాహం చేసుకున్నారు. అనంతరం నూతన దంపతులు చంద్రాపుర్​ జిల్లాలో నివాసముంటున్నారు. మూడు నెలల గర్భిణీగా ఉన్న ఆమె ఓ రాత్రి బహిర్భూమికి వెళ్లింది. ఆరుబయటకు వెళ్లిన ఆమె.. కొన్ని గంటలైనా ఇంటికి తిరిగిరాలేదు. మహిళ కోసం కుటుంబ సభ్యులు వెతగ్గా.. చివరకు ఆమె ఓ బావిలో విగతజీవిగా ఉండటాన్ని గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు కుటుంబసభ్యులు.

 

చితిలోకి దూకిన భర్త:

రుచితా మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహిస్తుండగా.. ఆమె మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన కిషోర్​ చితిలోకి దూకాడు.​ ఈ విషయాన్ని గమనించిన చుట్టుపక్కల వాళ్లు అతడిని రక్షించారు. అయితే ఇంటికి చేరుకున్నాక బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: