కరోనా వైరస్ ఉదృతి భారత దేశంలో ప్రతిరోజు పెరుగుతూనే ఉంది. ఈ వైరస్ కట్టడికి విరుగుడు కనిపెట్టేందుకు ఎంతోమంది తలపండిన పరిశోధకులు పరిశోధనలు నిర్విరామంగా చేస్తూనే ఉన్నారు కానీ ఇప్పటివరకు సమర్థవంతమైన కరోనా వైరస్ వ్యాక్సిన్ ని ఎవరూ కనిపెట్టలేదు. వాళ్ళందరి వల్ల కానిది తన వల్ల అవుతుందని చెప్పుకొస్తున్నాడు ఒక దొంగ. ఈ కథాకమామిషు ఏంటో తెలుసుకుంటే... ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాశి నగరం లక్సా  ప్రాంతంలో గురువారం అనగా 25వ తేదీన రాత్రి సమయంలో ఒక ఫంక్షన్ హాల్ ముందు పల్సర్ బైక్ పార్క్ చేశాడు ఓ యజమాని. అయితే కొంత సమయం తర్వాత ఆ పల్సర్ బైక్ మాయం కావడంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు బాధితుడు. వెంటనే స్పందించిన పోలీసులు బండి నెంబర్ ని ఇతర అన్ని పోలీస్ స్టేషన్లకు వాట్సాప్ చేశారు. దీంతో చుట్టు పక్కల పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు అప్రమత్తమై చోరీకి గురికాబడ్డ బైకు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 


అయితే కొన్ని గంటల్లోనే ఒక వ్యక్తి పల్సర్ పై నరేష్ సర్ ప్రాంతం గుండా వెళుతుండగా పోలీసులు గమనించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి విచారించగా అతడు దిమ్మతిరిగే సమాధానాలు చెప్పి పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. బైకు నీదేనా? అని ప్రశ్నించగా అతడు తలతిక్క సమాధానం చెప్పాడు. విషయం అర్థమైన పోలీసులు అతడిని ఎందుకు చోరీ చేసావ్ రా, నాయనా అని అడిగితే... మనదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిపోతుంది. ఇప్పటి వరకు ఎవరూ మందును కనుగొనలేదు. అందుకే నేనే పరిశోధనలు చేసి కరోనాకు మందు కనిపెట్టాలని భావించాను. కానీ పరిశోధనలు చేసేందుకు నా దగ్గర సరిపడినన్ని డబ్బులు లేవు. అందుకే బైక్ దొంగతనం చేయాల్సిన పరిస్థితి వచ్చింది', అని అతడు తాను చేసిన దొంగతనం ఒప్పుకున్నాడు. 


దీంతో పోలీస్ స్టేషన్ లో ఉన్న పోలీస్ అధికారులంతా ఒక్క సారిగా అవాక్కయ్యారు. తదనంతరం అతడిని తమదైన శైలిలో మందలించి విచారణ చేపట్టి అతడి పేరు రాహుల్ యాదవ్ అని, అతడు ఇంతకు ముందు కూడా కొన్ని నేరాలను చేశాడని పోలీసులు కనుగొన్నారు. ప్రస్తుతం ఈ దొంగ కరోనా పరిశోధకుడి పై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: